
ఇంట గెలిచి.. రచ్చ గెలవని మోదీ
పాకిస్థాన్ భూభాగంలోకి భారత భద్రతా దళాలు చొచ్చుకుపోయి టెర్రరిస్టు శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడంలో విజయం సాధించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో తన పరువు, ప్రతిష్టలను ఇనుమడింపజేసుకున్నారు.
పాకిస్థాన్ భూభాగంలోకి భారత భద్రతా దళాలు చొచ్చుకుపోయి టెర్రరిస్టు శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడంలో విజయం సాధించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో తన పరువు, ప్రతిష్టలను ఇనుమడింపజేసుకున్నారు. ఇదే అంశంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడంలో మాత్రం మోదీ ప్రస్తుతానికి ఓడిపోయారనే చెప్పవచ్చు. బ్రిక్స్ దేశాలను తనదారికి తీసుకొచ్చి పాకిస్థాన్‌ను ఒంటరిని చేయాలనే ప్రయత్నంలో మోదీ దౌత్యం విఫలమైంది.
తొలుత భారత్ విజ్ఞప్తి మేరకు సూత్రప్రాయంగా టెర్రరిజాన్ని ఖండించిన చైనా, రష్యా దేశాలు టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందన్న ఫిర్యాదును పట్టించుకోలేదు. బ్రిక్స్ సదుస్సు తీర్మానంలో కనీసం పాకిస్థాన్ పేరును పరోక్షంగా కూడా ప్రస్తావించేందుకు చైనా అంగీకరించలేదు. ఈ విషయంలో చైనాకే రష్యా మద్దతు పలికింది. ఇక మోదీ చేసేది లేక పాక్ పేరును ప్రస్తావించకుండానే ఉగ్రవాద నిర్మూలన గురించి ధర్మోపన్యాసం ఇచ్చి తప్పుకున్నారు. పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్టు సంస్థల పేర్లను ప్రస్తావించేందుకు కూడా ఆ రెండు దేశాలు అంగీకరించలేదు. పాకిస్థాన్ టెర్రరిస్టు మసూద్ అజర్‌పై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రయత్నాలను కూడా నెలరోజుల క్రితం చైనా అడ్డుకుంది.
పాత మిత్రుడైన రష్యా కూడా భారత్‌తో కలసి రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో భారత్‌కు తెలియని పరిస్థితి. పైగా పాకిస్థాన్‌తో కలసి రష్యా సైనిక దళాలు ఇటీవలే సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ దాడులను ముందుగా సమర్థించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత రష్యా కారణంగా మెత్తపడింది. భారత్ వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్‌లో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితే, రష్యా అక్కడ ఏకంగా 2,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాంటప్పుడు వాళ్లపై ఎవరి ఆదేశం ముద్ర ఉంటుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.
భారత్ జరిపిన సర్జికల్ దాడులను సమర్థిస్తూ పాక్ టెర్రరిజాన్ని ఖండించిన అమెరికా కూడా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించేందుకు ససేమిరా అంగీకరించలేదు. పాక్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని కోరుతూ టెర్రరిజమ్‌పై అమెరికా పార్లమెంట్‌కు చెందిన సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పో ప్రవేశపెట్టిన బిల్లును ఒబామా అధికార యంత్రాంగం ఆమోదిస్తుందన్న ఆశ ఏ మాత్రం లేదు. సర్జికల్ దాడులతో ఇంట గెలిచిన మోదీ రచ్చ గెలవాలంటే భారత విదేశాంగ విధానంలో వ్యూహాత్మక మార్పులు తేవాల్సిందే.