‘ఉద్ధ’రించిందేమీ లేదు..!

‘ఉద్ధ’రించిందేమీ లేదు..!


సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రేకు నాయకత్వ లక్షణాలు లేవు..అసలు శివసేనకు అతడు చేసిందేమీ లేదు.. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను అత్యధికంగా ఇబ్బంది పెట్టింది ఉద్ధవ్ ఠాక్రేనే.. ఈ నిజాన్ని ఆయన ఇంట్లో పనిచేసే నౌకర్లను అడిగినా చెబుతారని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే విమర్శించారు. కొంకణ్ పర్యటనలో భాగంగా నారాయణ్ రాణే సింధుదుర్గ్ జిల్లాకు బయలుదేరారు.అంతకు ముందు హాత్‌ఖంబా ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిష్టతో పనిచేసేవారికి, సమర్థవంతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తను ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ందులో ఎటువంటి మార్పూ లేదని, రాజీనామాకు గల కారణాలను అప్పుడే స్పష్టం చేస్తానని తెలిపారు.

 

‘ఉద్ధవ్ ఠాక్రే నన్ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన విమర్శలు, దూకుడుతనం మరింత ఎక్కువైంది.. ఇతరులపై ఆరోపణలు చేయడానికి బదులు బాల్ ఠాక్రే ఆదర్శాలను, సిద్ధాంతాలను కాపాడేందుకు కృషిచేస్తే మంచిది..’ అని రాణే వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మరోసారి ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, మొత్తం వారి కుటుంబంలో, పార్టీలో ఏం జరుగుతుందో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు.‘కొంకణ్‌వాసులను భయాందోళన నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తానని ఉద్ధవ్ అంటున్నారు.. నేను నెలకు మూడుసార్లు కొంకణ్‌లో పర్యటిస్తుంటాను.. ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదుల దాడులు, భయానక వాతావరణం, నేరాల కేసులు నమోదు కావడం లాంటి సంఘటనలు నాకు ఎక్కడా కనిపించడం లేదు.. మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్న ఆ భయాందోళనలు ఏమిటో. .’నని చమత్కరించారు. ఎన్నికలు సమయంలో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు కొంకణ్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు రైళ్ల గురించి పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్ధవ్‌కు తెలుసా అని ప్రశ్నించారు.

 

‘ప్రస్తుతం పెరిగిన రైలు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మీకు కనిపించడం లేదా.. లేకుంటే ఇవన్నీ చూసి మీకు భయమేస్తోందా.. అలా అయితే కొంకణ్ రావద్దు’ అని ఉద్ధవ్‌కు రాణే సలహా ఇచ్చారు . లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఎంపీలు గెలవడంలో వారి గొప్పతనమేమీ లేదన్నారు. కేవలం మోడీ ప్రాబల్యం వల్లే వారంతా గెలిచి గట్టేక్కారని వ్యాఖ్యానించారు.‘శివసేనకు నాయకుడు లేడు.. అది నేతృత్వం లేని పార్టీ. అందులో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహిస్తున్న పాత్ర ఏమీ లేద’ని రాణే దుయ్యబట్టారు.‘ 39 సంవత్సరాలు శివసేనలో కొనసాగాను.. అందులో ఆఖరు 15 సంవత్సరాలు బాల్ ఠాక్రేకు దగ్గరగా ఉన్నాను.. వాస్తవానికి శివసేన నుంచి బయటపడిన వారందరి కంటే బాల్ ఠాక్రేను ఎక్కువగా వేధించింది ఉద్ధవ్ ఠాక్రేనే..’అని ఘాటుగా విమర్శించారు. ‘బాల్ ఠాక్రే అప్పట్లో కుటుంబ సభ్యుల్ని, ఇంటిని వదిలి రెండుసార్లు బయటపడ్డారు. ఆయన ఎందుకు వెళ్లారు..? ఎక్కడ ఉంటుండేవారు...? మాకు తెలుసు.. ఇంటి వాతావరణం గురించి నౌకర్లను అడిగితే వారే చెబుతారు’ అని రాణే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

 

రాణే ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలియదు : మాణిక్‌రావ్


నాగపూర్: మంత్రిపదవికి నారాయణ్ రాణే ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారో తనకు తెలియదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాణేకు ప్రభుత్వంలో సముచితం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న రాణే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే అధిష్టానంతో ఆయన చర్చించవచ్చని ఠాక్రే సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top