‘మేము రాముడి వంశస్థులమే.‍.మమ్మల్ని సం‍ప్రదించవచ్చు’

Mewar Udaipur Royal Family Member Claims To Be Lord Ram Descendan - Sakshi

జైపూర్‌ : అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మేవార్‌ ఉదయ్‌పూర్‌ రాజకుటుంబీకుడైన మహేంద్ర సింగ్‌ స్పందించారు. తాము రాముడి వంశస్థులమని, ఒకవేళ ఏవైనా వివరాలు కావాలనుకుంటే కోర్టు తమను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో అవసరమైన సాక్ష్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన పత్రాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు.

కాగా అయోధ్య భూ వివాదం కేసులో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫు న్యాయవాది పరాశరన్‌ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది.  దీంతో పరాశరన్‌ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు.

ఈ నేపథ్యంలో తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందినవారమని జైపూర్‌ రాజకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి పేర్కొన్న విషయం విదితమే. ఆదివారం ఆమె మాట్లాడుతూ..  ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం, ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. మా వంశవృక్షంలో 62వ రాజుగా దశరథుడు, 63వ రాజుగా రాముడు, 64వ రాజుగా కుశుడి పేరు ఉన్నాయి. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top