పగలు ఆడ.. రాత్రి మగ

Man Working in Woman Getup in Tamil Nadu - Sakshi

తల్లిదండ్రులనుపోషించుకోవడానికి మదురై యువకుడి పాట్లు

ఆడవేషంలో పాచిపనులు చేస్తున్న వైనం

సోషల్‌ మీడియాలో చిత్రాలు

టీ.నగర్‌(చెన్నై): కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ కోవలోనే మదురైలోని ఓ వ్యక్తి ఆరునెలలుగా ఆడవేషం ధరించి ఇళ్లలో పనులు చేస్తూ పొట్టనింపుకుంటున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇతని సొంతవూరు శివగంగై జిల్లా మానామదురై. వయసు సుమారు 40 ఉంటుంది. తన ఊరిలో ఇతను లుంగీ, షర్టు ధరిస్తాడు. ప్రతిరోజూ ఊరి నుంచి మదురైకు వచ్చి రాజర్‌రోడ్డు తెప్పకుళం ప్రాంతంలో ఒక మరుగైన ప్రదేశం చేరుకుంటాడు. అక్కడ లుంగీ, షర్టు విప్పేసి చీర, జాకెట్, తలకు విగ్‌ ధరించి ఆడవేషంలో బయటికి వస్తాడు. ఆ ప్రాంతంలోని మూడు ఇళ్లకు వెళ్లి పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు చేసి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి తలపై విగ్‌ తొలగించి లుంగీ, షర్టుతో ఊరికి బయలుదేరుతాడు.

రాజా.. రాజాత్తి
అతను మగాడిగా వెళ్లి దుస్తులు మార్చుకుని ఆడదానిలా రావడాన్ని ఆ ప్రాంతానికి చెందిన కొందరు గమనించారు. దీంతో అతన్ని పట్టుకుని విచారణ జరిపారు. అందులో అతని అసలైన పేరు రాజాగా తెలిసింది. తాను పనిచేసే ఇళ్లలో తన పేరు రాజాత్తిగా చెప్పుకున్నట్లు తెలిపాడు. మానామదురైలో తనకు ఎలాంటి పని దొరకలేదని, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకునేందుకు గత్యంతరం లేక ఆడవేషం వేసినట్లు తెలిపాడు. ఆరునెలల క్రితం పనుల కోసం మదురైకి వచ్చానన్నాడు.

మూడు ఇళ్లలో పనులు:  తనను మహిళగా భావించి మూడు ఇళ్లలో పనులు ఇచ్చారని, అక్కడ ఇంటి పనులు చేసి మళ్లీ సాయంత్రం ఇంటికి వెళతానన్నాడు. ఈ విధంగా వచ్చే ఆదాయంతో వృద్ధాప్య తల్లిదండ్రులను కాపాడుతున్నానని తెలిపాడు. తాను వివాహం చేసుకోలేదని, కొందరు తాను మహిళ వేషంలో మోసగిస్తున్నట్లు భావించవచ్చని, అయితే తల్లిదండ్రులను చూసుకోవడానికి తనకు మరో మార్గం కనిపించలేదని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ఇళ్లలో ఇంతవరకు ఎవరూ అనుమానించలేదని, తన మాటలు, నడవడిక మహిళల రీతిలో ఉండేలా చూసుకుంటానన్నారు. తాను పనులు చేస్తున్న చోట క్రమశిక్షణతోనే మెలిగానని తెలిపాడు. ఏదైనా ఒకరోజు యజమానులకు ఈ విషయం తెలిసినా.. తన పరిస్థితి గమనించి పనిలో పెట్టుకుంటారని ఆశతో పనిచేస్తున్నానని చెప్పాడు.

సామాజిక మాధ్యమాల్లో..
రాజా దుస్తులు మార్చుకుని మహిళగా వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్‌ అయ్యాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మదురైలో సంచలనం ఏర్పడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top