
కొత్త సీసాలో పాత సారా 'మేక్ ఇన్ ఇండియా'
భారత్‌లో వ్యాపారాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా విధానపరమైన సంస్కరణలను తీసుకొస్తామని, పన్నుల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతామంటూ ప్రపంచ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊదరగొట్టారు.
భారత్‌లో వ్యాపారాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా విధానపరమైన సంస్కరణలను తీసుకొస్తామని, పన్నుల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతామంటూ ప్రపంచ పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊదరగొట్టారు. తన మానస పుత్రిక 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ముంబైలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 'మేక్ ఇన్ ఇండియా'లో పేర్కొన్న లక్ష్యాలన్నీ కూడా అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన 'జాతీయ ఉత్పత్తి విధానం'లో ఉన్నవేనన్న విషయాన్ని ట్విట్టర్ యూజర్లు కనిపెట్టడంతో మేక్ ఇన్ ఇండియా డొల్లతనం బయటపడింది.
1. జాతీయ స్థూల ఉత్పత్తిలో.. ఉత్పాదక రంగం వాటాను 2022 నాటికల్లా 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడం మేక్ ఇన్ ఇండియా లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. యూపీఏ ఉత్పత్తి విధానంలో కూడా ఇవే అంకెలు, వివరాలు ఉన్నాయి.
2. 2022 నాటికి ఉత్పత్తి రంగంలో అదనంగా పది కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఇది కూడా యూపీఏ ప్రభుత్వం తన రెండో లక్ష్యమని ప్రకటించింది.
3. సమ్మిళిత అభివృద్ధి కోసం గ్రామీణ వలసదారులు, పట్టణ పేదలకు సముచిత నైపుణ్యాన్ని అందిస్తామని 'మేక్ ఇన్ ఇండియా'లో పేర్కొన్నారు. ఈ అంశం కూడా అక్షరం పొల్లుపోకుండా యూపీఏ జాతీయ ఉత్పత్తి విధానం నుంచి తీసుకున్నదే. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలుగా మోదీ ఊదరగొట్టిన లక్ష్యాలన్నీ పాత యూపీఏ విధానంలో ఉన్నవేనని, ఇది కొత్త సీసాలో పాత సారా కథలాంటిదేనని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఆసియాలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌ను చైనాలాగా ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ తీసుకొచ్చారు.