మంత్రి కూతురికి స్కాలర్‌షిప్‌.. విమర్శలు | Maharashtra Minister's Daughter Shruthi on Scholarship Controversy | Sakshi
Sakshi News home page

మంత్రి కూతురికి స్కాలర్‌షిప్‌.. విమర్శలు

Sep 8 2017 9:12 AM | Updated on Oct 8 2018 5:45 PM

మంత్రి కూతురికి స్కాలర్‌షిప్‌.. విమర్శలు - Sakshi

మంత్రి కూతురికి స్కాలర్‌షిప్‌.. విమర్శలు

ఓ మంత్రి కూతురి స్కాలర్‌షిప్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. అధికారం అండతో ఆమెకు...

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఓ మంత్రి కూతురి వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం తరపు నుంచి ఆమెకు స్కాలర్‌ షిప్‌ మంజూరుకాగా, అది కాస్త వివాదాస్పదం కావటంతో ఆ యువతి స్పందించింది. తాను ప్రభుత్వం నుంచి పైసా కూడా తీసుకోబోనని ప్రకటించింది. 
 
సామాజిక న్యాయ శాఖ మంత్రి రాజ్‌కుమార్‌ బదొలె కుమార్తె శృతి విదేశాల్లో విద్య అభ్యసించేందుకు స్కాలర్‌​ షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఏటా విదేశాల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా స్కాలర్‌​ షిప్‌ మంజూరు చేస్తుండగా, ఈ యేడాది జాబితాలో శృతి పేరుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారుల పిల్లల పేర్లు కూడా ఉన్నాయి. దీంతో అధికారం అండతో వాళ్ల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తూ పేద విద్యార్థుల పొట్టలు కొడుతున్నారంటూ విపక్షాలు విమర్శలకు దిగాయి. 
 
ఐఐటీ-మద్రాస్‌ లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన శృతి బదొలే చివరకు ఇష్యూపై స్పందించింది. ‘స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసిన మాట వాస్తవమే. నేను చదవాలనుకుంటున్న మాంచెస్టర్‌ యూనివర్సిటీ(యూకే)లో స్కాలర్‌షిప్‌లు ఇవ్వరు. అందుకే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు అయ్యింది. మంత్రి కూతురిగా పుట్టడం నా తప్పా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే తన సోదరుడి పేరిట ఉన్న లోన్‌పై నెలనెలా ఈఎంఐలు కడుతున్నామని, ఈ నేపథ్యంలో తాను విద్యార్థి లోన్‌కు అనర్హురాలినయ్యానని ఆమె తెలిపింది. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన స్కాలర్‌ షిప్‌ కూడా తనకు అక్కర్లేదని శృతి స్పష్టం చేసింది.
 
దీనిపై మంత్రి, ఆయా అధికారులు స్పందిస్తూ...తాము ఎవరిపైనా ఒత్తిడి తేలేదని, మెరిట్‌ ప్రకారమే తమ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు లభించాయని చెబుతున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ మంత్రిని, అధికారులను వివరణ కోరినట్లు సమాచారం. ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన 35 మంది ఎస్సీ, ఎస్టీ మెరిట్‌ విద్యార్థులకు  2015 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తూ వస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement