చైనాలో తెలుగు వారు ఆందోళన చెందొద్దు

Kishan Reddy Suggests Telugu People Over Coronavirus - Sakshi

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని తెలుగు వైద్య విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఢిల్లీ తెలుగు సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఏపీ ఎమ్మెల్సీ మాధవ్, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు, బీజేపీ నేత పి. రఘురాం, ఢిల్లీ తెలుగు సంఘాల నేతలు హాజరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషిచేయాలని కిషన్‌రెడ్డి వారిని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌కు సంబంధించి కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో మనవారిని చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నామన్నారు. శనివారం 324 మంది, ఆదివారం మరికొంత మందిని తరలించామని, వారిని 15 రోజులు పరిశీలనలో పెట్టినట్లు తెలిపారు. బడ్జెట్‌పై స్పందిస్తూ..‘కేంద్ర బడ్జెట్‌ చాలా బాగుంది.. అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్‌ అనవసరంగా  విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదు..’అని పేర్కొన్నారు.

తెలంగాణలో నియంతృత్వ పాలన
తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. నిర్మల్‌ జిల్లా భైంసాలో ఎంఐఎం అండతో ఓ వర్గానికి చెందినవారు మరొక వర్గానికి చెందిన వారిపై జరిపిన దాడుల్లో బాధితుల ఆవేదనను బయట ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు సిద్దూపై పోలీసులు కేసులు పెట్టడం అక్రమమని తెలిపారు. సిద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అనుసరించిన వైఖరిని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిద్దూకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై తాను తెలంగాణ డీజీపీతో మాట్లాడతానని కిషన్‌రెడ్డి తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top