కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు

Kerala Cancels Onam Celebrations - Sakshi

తిరువనంతపురం : అందమైన ఉద్యానవనాలు, పర్యాటక రంగానికి మారుపేరైన కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కకావికలం చేశాయి. వరుణుడి ఉగ్రరూపానికి కేరళ అల్లకల్లోలమవుతోంది. సుమారు ఒక శతాబ్దంలో ఇంతటి ప్రకృతి కోపాన్ని కేరళ రుచిచూడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రతేడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. కేరళలో ఓనం ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. 

ఓనం పండుగ పంటల పండుగగా ఎంతో సుప్రసిద్ధమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది.  కానీ ఈసారి  ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓనం కోసం పక్కకు తీసి పెట్టిన నగదును సహాయనిధి కోసం వాడనున్నామని విజయన్ మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. 

ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. ఆగస్టులో ఓ వారమంతా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఆగస్టు 25న తిరు ఓనం పండుగ. కాగ, ఆగస్టు 8 నుంచి కేరళ వరదల్లో కొట్టుమిట్టాడుతోంది.గత వారం 39 మంది మరణించగా.. నలుగురు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది ఈ వరదలకు ప్రభావితమైనట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈసారి ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 

ఉపశమనం, పునరావాస కార్యక్రమాలను వెంటనే చేపట్టేందుకు కేబినెట్‌ సబ్‌-కమిటీని నియమించాలని నిర్ణయించినట్టు విజయన్‌ చెప్పారు. సెప్టెంబర్‌ 3 నుంచి 15 వరకు ఎవరైతే విలువైన రికార్డులను కోల్పోయారో, వారికి డూప్లికేట్లు జారీ చేసేందుకు స్పెషల్‌ కోర్టులు నిర్వహించబోతున్నారు. ఈ రికార్డులను ఉచితంగానే జారీ చేయబోతుంది. పరిహార మొత్తాలను ఎప్పుడు బదిలీ చేస్తుందో కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీని కోరామని, వాటిపై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని కోరామని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top