
'మోదీ.. మీ సుష్మాను దించేయండి'
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నేరుగా విమర్శలు కురిపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై నేరుగా విమర్శలు కురిపించారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమ పార్టీ నేత మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ఫేక్ డిగ్రీలు, అరెస్టు చేసిన అంశంపై బీజేపీ నేతలు చర్చ లేపిన సందర్భంగా ఆయన సూటిగా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ వెంటనే సుష్మా స్వరాజ్ను కేబినెట్ నుంచి తొలగించాలని, బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
తమ పార్టీ తోమర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చూసైనా మోదీ నేర్చుకోవాలని విమర్శించారు. తొలుత తాను కూడా తోమర్ తప్పు చేయలేదనే అనుకున్నానని, తర్వాతే అతను తప్పుచేసినట్లు గుర్తించి బాధ్యతల నుంచి తప్పించానని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీని ఆయన కేబినెట్ మంత్రులంతా తప్పుడుదారి పట్టిస్తున్నారని, ఆయన తప్పనిసరిగా లలిత్ మోదీకి వీసా సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను ప్రధాని తొలగించాలని డిమాండ్ చేశారు.