
మహిళా జడ్జి పక్కటెముకలు విరిచి దారుణ హత్య
సామాన్య స్త్రీలకే కాదు.. జడ్జి హోదాలో ఉన్న మహిళకు కూడా భర్త నుంచి వేధింపులు తప్పలేదు.
కాన్పూర్: సామాన్య స్త్రీలకే కాదు.. జడ్జి హోదాలో ఉన్న మహిళకు కూడా భర్త నుంచి వేధింపులు తప్పలేదు. ఇష్టం లేకపోయిన అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేయడంతోపాటు చిత్ర హింసలకు గురిచేసి గొంతునులిమి ఓ మహిళా జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ను చంపేసిన ఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కాన్పూర్ లో ప్రతిభా గౌతమ్ అనే మహిళ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్గా విధులు నిర్వహిస్తోంది. అయితే, ఆమె ఇటీవల గర్భం దాల్చగా తనకు ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకోవాలని ఆమె భర్త, న్యాయవాది మను అభిషేక్ రాజన్ ఆమెపై పదేపదే ఒత్తిడి తీసుకురావడంతోపాటు చిత్ర హింసలకు గురిచేశాడు.
అనంతరం గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేయగా ప్రతిభ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో పోస్ట్ మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. ఆమె శరీరంపై 20 చోట్ల బలమైన గాయాలయ్యాయని, పక్కటెముకలు ఒకవైపు ఎనిమిదిచోట్ల, మరోవైపు ఐదుచోట్ల విరిగిపోయాయని, శరీరంలోని ఇతర ప్రముఖ అవయవాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడని, అనంతరం ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో అతడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.