మహానుభావుడు... మరి లేరు

Justice Rajinder Sachar A Legend In His Lifetime - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్‌ రాజిందర్‌ సచార్‌. నిన్న (శుక్రవారం) ఢిల్లీలో కన్నుమూశారు. ఆయనకు 95 ఏళ్లు. ఆయన్ని ఎన్నో రకాలుగా గుర్తించుకోవచ్చు. అయినప్పటికీ మెయిన్‌ మీడియా ఆయనను ఎందుకు విస్మరించిందో తెలియదు. రాజిందర్‌ సచార్‌ ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. పౌరుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తే కాకుండా సోషలిస్ట్‌ పార్టీలో పనిచేసిన వారు. రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి భీమ్‌ సేన్‌ సచార్‌ పంజాబ్‌కు రెండుదసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలక ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే వారు.

భారత తొలి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 1953 ప్రాంతంలో అప్పడు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న భీమ్‌ సేన్‌ సచార్‌ నివాసానికి విందు భోజనానికి హాజరయ్యారు. ఆ విషయాన్ని ఆయన ముందుగానే తన కుమారుడైన రాజిందర్‌ సచార్‌కు గొప్పగా చెప్పి, తమతోపాటు అల్పాహార విందుకు ఉండాలని కోరారట. మామూలుగా అయితే ఉండేవాణ్నేమోగానీ, నెహ్రూ వస్తున్నానంటే అసలే ఉండనంటూ రాజిందర్‌ సచార్‌ బయటకు వెళ్లిపోయారట. అప్పటికే రాజిందర్‌ సచార్‌ సోషలిస్ట్‌ పార్టీలో చేరి కాంగ్రెస్‌ విధానాలను విమర్శిస్తున్నారు. ప్రేమ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజిందర్‌ సచార్‌ 1948లో సోషలిస్ట్‌ పార్టీలో చేరారు. నెహ్రూతోని అల్పాహార విందుకు హాజరుకానందుకు కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎలాంటి హాని చేయలేదంటూ అప్పుడప్పుడు ఆయన ఆ పార్టీపై చురకలేసేవారు.

దేశంలో ముస్లింల స్థితిగతులు, అభ్యున్నతి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి వేసిన ఉన్నతస్థాయి కమిటీకి రాజిందర్‌ సచార్‌ చైర్‌పర్సన్‌గా వ్యవరించి ఓ సుదీర్ఘ నివేదికను సమర్పించారు. 2006లో వెలుగుచూసిన ఆ నివేదిక పట్ల పలు సామాజిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. దేశంలో ఎస్టీ, ఎస్సీలకన్నా ముస్లింలు బాగా వెనకబడి ఉన్నారని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లాంటి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో కేవలం 3.2 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని ఆయన నివేదిక వెల్లడించింది.

ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ముస్లింలు మెరుగైన పరిస్థితుల్లో బతుకుతున్నారని, అందుకు కారణం ముస్లింలకు కొంత మేరకు రిజర్వేషన్లు కల్పించడమేనని కూడా ఆయన నివేదిక పేర్కొంది. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉందనే భ్రమ అప్పట్లో ఉండేది. అదంతా ఒట్టిదని, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనే ముస్లింలు దేశంలోకెల్లా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, 2011లో ఆ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం పడిపోవడానికి ముస్లింల వ్యతిరేకతే కారణమని కూడా సచార్‌ నివేదిక వెల్లడించింది. దేశంలో ముస్లింల అభ్యున్నతి కోసం జస్టిస్‌ రాజిందర్‌ సచార్‌ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని పలు పార్టీల నుంచి నేటికి డిమాండ్‌ వినిపిస్తూనే ఉంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top