మమత మాట కాదన్న జూడాలు

Junior Doctors Reject Mamata Banerjee's Offer - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూడాల నిరసన మరింత ఉధృతమయ్యింది. గత వారంలో కోల్‌కతా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో 85 యేళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందికి ,అనేక మంది జూనియర్‌ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వారు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే.

ఈ విషయం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ మమతకు సూచించారు. ఈ మేరకు జూడాలను చర్చలకు ఆహ్వానించగా వారు తిరస్కరించారు. నిరసనను నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. తాను కోల్‌కతా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు జూడాలు తనతో కూడా సరిగా ప్రవర్తించలేదని అయిన వారు చిన్నవారు కావడంతో తాను కూడా అవేమి పట్టించుకోలేదని,వారు తమ పనిని పునఃప్రారంభించడమే తనకు కావాలని మమత అన్నారు. అయితే మమత వ్యాఖ్యలను అనేక మంది తప్పుబడుతున్నారు. ఆసుపత్రిలపై జరిగే మూర్ఖపు దాడులను ప్రోత్సహించకూడదన్నారు. ఈ క్రమంలో జూడాలపై మమత చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు రేపడంతో కేంద్ర మంత్రులు, బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి సహా సొంత పార్టీ నేతల నుంచి మమత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జూడాల సమ్మె గురించి చర్చించడానికి తాను మమతకు కాల్‌ చేశానని..అయితే మమత స్పందించలేదని గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి తెలిపారు. కాగా మమత తీరుకు నిరసనగా కోల్‌కతాలోని 300 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. జూడాలకు మద్దతుగా బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా,ఒడిశా, అస్సాం ,త్రిపురలోని డాక్టర్లు వారికి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లోగా జూడాల సమస్యలు పరిష్కరించాలని ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ బెంగాల్‌ ప్రభుత్వానికి సూచించింది. అలా జరగని పక్షంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. దీనిపై స్పందించి ఏడు రోజుల్లో సమాధానమివ్వాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top