అపస్మారక స్థితిలోనే జయ తరలింపు!

Jayalalithaa's death mystery gets deeper

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 22న జయలలితను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించినప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ఓ వైద్య నివేదిక స్పష్టంచేస్తోంది.

నివేదికలోని వివరాల ప్రకారం.. ఆ రోజు రాత్రి పదింటికి పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం నుంచి ఆస్పత్రికి అంబులెన్స్‌ కోసం ఫోన్‌ వెళ్లింది. రాత్రి 10.20 గంటలకు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తరలిస్తున్నప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆమె గుండె వేగం, రక్తపోటు, చక్కెరస్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నాయని అత్యవసర విభాగంలో చేసిన పరీక్షల్లో తేలింది.

న్యూమోనియా, థైరాయిడ్‌ సమస్యలనూ వైద్యులు గుర్తించారు. అత్యవసర విభాగంలో అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. ఓ తమిళ మీడియా ఈ నివేదికను బహిర్గతం చేసింది. తొలుత సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఈ నివేదిక అందుకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. జయలలిత మరణంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నివేదిక కలకలం రేపింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top