ఐసిస్‌ వద్దు బాబోయ్‌.. వెనక్కొచ్చేస్తా..!!

Islamic State Man From Kerala Desires To Return Home - Sakshi

న్యూఢిల్లీ : అమెరికా సేనలు ఉక్కుపాదం మోపడంతో ఐసిస్‌ ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువత తిరుగుముఖం పడుతోంది. తిండీ తిప్పలు కొరవడిన దారుణ పరిస్థితుల నుంచి బయటపడేందుకు యువత యత్నిస్తోంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు స్వదేశానికి తిరిగొస్తానని కుటుంబీకులకు మొరపెట్టుకున్నాడు. వివరాలు.. ఇస్లాం రాజ్యస్థాపన భ్రమలతో ఐసిస్‌లో చేరేందుకు కేరళ నుంచి 12 మంది యువకులు 2016లో పయనమయ్యారు. వారంతా అఫ్గాన్‌ చేరుకోగా.. ఫిరోజ్‌ అలియాస్‌ ఫిరోజ్‌ఖాన్‌ (25) మాత్రం అక్రమంగా సిరియాలో చొరబడ్డాడు. అయితే, వారి అంచనాలు తల్లక్రిందులయ్యాయి. తీవ్రవాద అంతానికి అగ్రరాజ్యం అమెరికా గట్టి చర్యలు తీసుకోవడంతో ఐసిస్‌ సంక్షోభంలో పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దారిద్ర్యంలోకి ఆ ఉగ్రసంస్థ చేరింది. దాంతో అక్కడే ఉంటే ప్రాణాలు నిలుపుకోవడం కష్టమనుకున్న ఫిరోజ్‌ఖాన్‌ గతనెలలో ఇంటికి ఫోన్‌ చేశాడు. ఇంటికి తిరిగొస్తానని, పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. 

అక్కడే మలేషియా అమ్మాయితో తనకు వివాహం చేశారని, తర్వాత ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని తల్లితో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అతను, ఎప్పుడు ఎక్కడ లొంగిపోతాననే విషయం వెల్లడించలేదని తెలిసింది. ఇక ఫిరోజ్‌ ఫోన్‌కాల్ గురించి తెలిసిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘కుంటుంబ సభ్యులతో ఫిరోజ్‌ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. గతంతో బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి వారిని ఐసిస్‌లో చేర్పించేందుకు యత్నించాడనే సమాచారముంది. ఐసిస్‌లో చేరండని కాసర్‌గాడ్‌ యువతను ప్రలోభపెట్టిన కేసులో అతను కూడా నిందితుడు’ అని సెక్యూరిటీ ఉన్నతాధికారులు తెలిపారు. కన్నూర్‌ జిల్లా నుంచి 35 మంది వరకు ఐసిస్‌ బాట పట్టారని, వారిలో చాలామంది అమెరికా సేనల దాడిలో ప్రాణాలు విడిచి ఉండొచ్చని అన్నారు. కన్నూర్‌ జిల్లాలోని కూడలి ప్రాంతానికి చెందిన షాజహాన్‌ (32) టర్కీ మీదుగా సిరియా వెళ్తూ పట్టుబడ్డాడని భద్రతా అధికారులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top