నేవీలో స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌లపై నిషేధం

Indian Navy bans use of smartphones - Sakshi

న్యూఢిల్లీ: సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నావికాదళం నిషేధం విధించింది. నేవీ సిబ్బంది మొత్తం నౌకలు, నావిక కేంద్రాల్లో వీటిని వాడకూడదు. యుద్ధవిమానాలు, జలాంతర్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పది రోజుల క్రితం నిఘా సంస్థలు ఏడుగురు నేవీ సిబ్బందిని, ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్‌ చేయడం తెల్సిందే. ముంబై, విశాఖపట్నం, కార్వారల నుంచి వీరిని అరెస్ట్‌ చేశారు. నౌకల్లో, నౌకా స్థావరాల్లో  ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ తదితరాల వాడకం ఉండదని నేవీ అధికారి తెలిపారు.  నావికాదళ సమాచారం ప్రత్యర్థులకు లీక్‌ అవుతున్న సంఘటనలపై జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది. ఇప్పటివరకూ ఈ కేసు ఏపీ పోలీసుల చేతుల్లో ఉండగా ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాన్ని ఎన్‌ఐఏకు బదిలీ చేసిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top