పాక్‌ జైలు నుంచి ప్రేమికుడి విడుదల

Indian boy who entered Pakistan illegally for Girlfriend - Sakshi

ఆరేళ్ల తర్వాత విడుదల

ఇస్లామాబాద్‌: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్‌ నిహాల్‌ అన్సారీ మంగళవారం విడుదలయ్యాడు. ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హమీద్‌ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్‌ మీదుగా పాక్‌ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించి పాక్‌ నిఘా సంస్థలు అరెస్ట్‌ చేశాయి.  2015లో పాక్‌ మిలటరీ కోర్టు అన్సారీపై కేసు విచారణ చేపట్టింది. ఫేక్‌ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్‌ జైలుకు తరలించారు.

2018 డిసెంబర్‌ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. హమీద్‌కు సంబంధించిన లీగల్‌ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్‌ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్‌ హైకోర్టు.. శిక్ష పూర్తయినా అన్సారీని జైళ్లో ఎందుకుంచారని పాక్‌ అడిషనల్‌ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించింది.  స్వదేశానికి పంపాలని ఆదేశించింది. దీంతో హమీద్‌ను మంగళవారం మార్దాన్‌ జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం ఇస్లామాబాద్‌ తరలించారు. హమీద్‌ పాక్‌ వెళ్లడంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. తన ప్రేమికురాలికి బలవంతంగా నిర్వహిస్తున్న పెళ్లిని ఆపేందుకు  ఖోహత్‌ అనే ప్రాంతానికి వెళ్లాడని ఓ పత్రిక వెల్లడించింది. ఎయిర్‌లైన్‌ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అప్ఘానిస్తాన్‌ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి 2012 నవంబర్‌లో అఫ్గాన్‌ వెళ్లాడని మరో మీడియా సంస్థ పేర్కొంది. 

ఫలించిన తల్లి పోరాటం..
తన కుమారుడు కనిపించడంలేదంటూ హమీద్‌ తల్లి ఫాజియా అన్సారీ ఇక్కడి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. స్పందించిన హైకోర్టు హమీద్‌ పాక్‌ ఆర్మీ కస్టడీలో ఉన్నాడని సమాధానమిచ్చింది. అక్కడి మిలటరీ కోర్టు అతడికి శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. తన బిడ్డను స్వదేశానికి తిరిగి రప్పించుకునేందుకు ఆమె చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత హమీద్‌ భారత్‌లోకి అడుగుపెట్టాడు. 

భారత గడ్డను ముద్దాడిన హమీద్‌..
హమీద్‌ మంగళవారం సాయంత్రం భారతదేశంలోకి అడుగుపెట్టాడు. వాఘా– అట్టారీ సరిహద్దు వద్ద భారత గడ్డను ముద్దాడాడు. అనంతరం సరిహద్దు వద్ద వేచిచూస్తున్న అతడి తల్లిదండ్రులను కలుసుకున్నాడు. హమీద్‌ను చూడగానే అతడి తల్లిదండ్రులు ఫాజియా అన్సారీ, నిహాల్‌ అన్సారీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో హమీద్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. హమీద్‌ విడుదలకు తోడ్పడిన భారత్, పాక్‌ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ దేశానికి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. హమీద్‌ విడుదలయ్యాడని తెలియగానే ముంబైలో అతడు నివసించే   వెర్సోవా ప్రాంతంలో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top