మోదీ వచ్చాకే మాపై దాడులు పెరిగాయి : నయాబన్స్‌ ముస్లింలు

If BJP Wins Polls Naya Bans Muslims Plan To Leave this Village - Sakshi

లక్నో : గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ ప్రాంతంలోని నయాబన్స్‌ గ్రామంలో చేలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాటి దుర్ఘటనలో ఓ పోలీస్‌ అధికారితో పాటు మరో పౌరుడు కూడా మరణించాడు. ఈ సంఘటన పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్‌ మీద మండిపడ్డాయి. బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ కరువయ్యిందని ఆరోపించాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి దాదాపు ఆరు నెలలు కావస్తోంది.

ఈలోపు సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చేశాయి. ప్రధాని పీఠాన్ని అధిరోహించేది ఎవరో మరి కొన్ని గంటల్లో తేలీపోతుంది. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్ని ‘ఔర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ అని తేల్చేశాయి. కానీ అసలైన ఫలితాలు వచ్చే వరకూ ప్రతి ఒక్కరిలోను టెన్షనే. ఈ నేపథ్యంలో గోరక్షకులు జరిపిన మూక దాడితో ఒక్క సారిగా వార్తల్లో నిలిచిన నయాబన్స్‌ గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియా టుడే.

ఆ వివరాలు గ్రామస్తుల మాటల్లోనే.. ‘ఒకప్పుడు మా పిల్లలు(ముస్లిం), వారి పిల్లలు(హిందువులు) కలిసి ఆడుకునే వారు. పండుగలను కూడా కలిసే జరుపుకునే వాళ్లం. ఏ కుటుంబంలో ఐనా ఓ వ్యక్తి అనారోగ్యానికి గురయినా.. చనిపోయినా గ్రామస్తులంతా వారికి తోడుగా నిలిచేవారు. ఒకరినొకరం వరసలతో పిల్చుకుంటూ.. ఆనందంగా గడిపేవాళ్లం. కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు రావడం ‍ప్రారంభించింది. హిందూ - ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గడం ప్రారంభమయ్యింది’ అన్నారు.

అంతేకాక ‘యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఏంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా పరిస్థితి మరి దిగజారి పోయింది. యోగి తీసుకువచ్చిన ‘హిందూ ఫస్ట్‌ నినాదం’.. మా బతుకులను ఇబ్బందుల్లోకి నెట్టిసింది. క్రమంగా మా మధ్య దూరం ప్రారంభమయ్యింది. మాట తీరులో కూడా తేడా వచ్చేసింది. హిందూ - ముస్లింలను విడదీయడమే మోదీ, యోగిల ఏకైక అజెండా’ అంటున్నారు నయాబన్స్‌ ముస్లింలు.

అంతేకాక ‘ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరులో జరిగిన మూక హత్య మా రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. గ్రామంలో దాదాపు 4 వేల మంది జనాభాలో మా సంఖ్య కేవలం 400 మాత్రమే. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ మా గ్రామంలో ఉండటం మంచిది కాదు అనిపిస్తుంది. మమ్మల్ని మేం రక్షించుకోవడం కోసం ఊరు విడిచి వెళ్తున్నాం. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్న కుటుంబాలన్ని ఇప్పటికే గ్రామాన్ని వదిలి వెళ్లాయి. ఈ సారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తే.. మిగతా కుటుంబాలు కూడా గ్రామం విడిచిపెట్టి వెళ్తా’యని తెలిపారు.

అంతేకాక ఈ దాడికి బాధ్యులుగా చేస్తూ.. 21 మంది మీద కేసు నమోదు చేశారు. వారంతా కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ఈ క్రమంలో షఫ్రుద్దీన్‌ సైఫి అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘నేను కల్లో కూడా పోలీసు స్టేషన్‌ పేరు తల్చుకోలేదు.. పోలీస్‌ స్టేషన్‌ లోపల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు.. నేరం అనే మాటను పలకడమే పాపంగా భావించే వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపిస్తే.. అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు కనీసం ఊహించలేరు. ఈ సంఘటనతో నా కుటుంబం చాలా భయపడింది. దాంతో గ్రామం వదిలి.. వేరే ఊరుకు అది కూడా మొత్తం ముస్లింలు ఉండే ప్రాంతానికి వెళ్లిపోయాం. ఇప్పుడు మేం చాలా ధైర్యంగా ఉన్నామ’ని తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top