విమానంలో భర్త.. ఏటీసీలో భార్య!

IAF Pilot Ashish Tanwar Wife Sandhya Saw AN-32 Going Off Radar - Sakshi

ఏఎన్‌–32 అదృశ్యంలో విధి వైచిత్రి

గల్లంతైందని తెలిసింది మొదట ఆమెకే

న్యూఢిల్లీ/ఇటానగర్‌: 12 మందితో ప్రయాణిస్తున్న ఆ విమానానికి భర్త పైలెట్‌ కాగా, భార్య ఏటీసీలో విధి నిర్వహణలో ఉన్నారు. ఆ విమానం(ఏఎన్‌–32) ఆచూకీ తెలియకుండా పోయిన విషయం మొదటగా తెలుసుకుంది ఆమెనే. వివాహమైన ఏడాదికే భర్త అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం..అందుకు భార్య ప్రత్యక్ష సాక్షి కావడం విధి ఆడిన వింత నాటకం! సోమవారం భారత్, చైనా సరిహద్దుల్లో ఆచూకీ తెలియకుండా పోయిన ఏఎన్‌–32 విమానం పైలెట్‌ ఆశిష్‌ తన్వర్‌(29)కాగా ఆయన భార్య సంధ్యా తన్వర్‌ ఆరోజు ఏటీసీ విధుల్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మెచుకాలోని వైమానిక స్థావరం నుంచి ఏఎన్‌–32 రకం విమానం 12 మందితో బయలుదేరింది.

ఒంటి గంట సమయంలో కంట్రోల్‌ రూంతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి. భర్త నడుపుతున్న విమానం కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని అందరికంటే ముందుగా జోర్హాట్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అధికారిగా ఉన్న సంధ్య గ్రహించారు. మిగతా వారిని అప్రమత్తం చేశారు. ఆశిష్‌ తన్వర్, సంధ్య వివాహం 2018లో కాగా, ఇద్దరూ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హోదా అధికారులే. పెళ్లయిన ఏడాదికే ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని సంధ్యా కలలోనైనా ఊహించి ఉండకపోవచ్చు. విమానంతోపాటు ఆశిష్, తదితరుల జాడ తెలియక పోవడంతో వారి కుటుంబసభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది. హరియాణా రాష్ట్రంలోని పల్వాల్‌లోని దీఘోట్‌ గ్రామానికి చెందిన ఆశిష్‌ బీటెక్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత ఆశిష్‌ 2013లో భారత వాయుసేనలో చేరారు.

దట్టమైన పొగ చూశాం: గ్రామస్తులు
సోమవారం మధ్యాహ్నం వైమానిక దళం విమానం కూలిన సమయంలో తమ సమీపంలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడం గమనించినట్లు గ్రామీణులు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సియాంగ్, పశ్చిమ సియాంగ్‌ జిల్లాల్లోని ఎత్తైన పర్వత శ్రేణుల్లో అన్వేషణ ముమ్మరం చేశారు. సియాంగ్‌ జిల్లా తుంబిన్‌ గ్రామస్తులు చెప్పిన దానిని బట్టి ఆ ప్రాంతంలో గాలింపు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సీఎం పెమా ఖండు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం షి–యోమి, సియాంగ్‌ జిల్లాల పరిధిలో విమానం జాడ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top