ఎస్పీలో సమసిన సంక్షోభం | Hung in UP | Sakshi
Sakshi News home page

ఎస్పీలో సమసిన సంక్షోభం

Sep 18 2016 2:06 AM | Updated on Sep 4 2017 1:53 PM

ఎస్పీలో సమసిన సంక్షోభం

ఎస్పీలో సమసిన సంక్షోభం

సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్-అబ్బాయ్ మధ్య బలవంతంగా సంధి కుదిరినట్లు కనబడుతోంది. ఎన్నికలకు ముందు విభేదాలన్నీ పక్కనపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

శివ్‌పాల్‌కు మద్దతుంటుందన్న అఖిలేశ్
 
 లక్నో:
సమాజ్‌వాదీ పార్టీలో బాబాయ్-అబ్బాయ్ మధ్య బలవంతంగా సంధి కుదిరినట్లు కనబడుతోంది. ఎన్నికలకు ముందు విభేదాలన్నీ పక్కనపెట్టి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం వరకు పరస్పర బహిరంగ విమర్శలు చేసుకోగా.. శనివారం అఖిలేశ్ మాట్లాడుతూ అంతా సర్దుకుంటుందన్న సంకేతాలిచ్చారు. బాబాయ్ శివ్‌పాల్‌కు పూర్తి మద్దతుంటుందన్నారు. యూపీ పార్టీ అధ్యక్షుడిగా శివ్‌పాల్ నియామకంతోనే వీరిద్దరి మధ్య గొడవ రోడ్డునపడడం తెలిసిందే.  పార్టీ  అధినేత ములాయం తీసుకున్న ఈ నిర్ణయం తనను బాధపెట్టిందని ఇటీవల చెప్పిన అఖిలేశ్.. శనివారం ‘యూపీ పార్టీ అధ్యక్షుడిని ఆయనింట్లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. 

వచ్చే ఏడాది జరిగే అభ్యర్థుల ఎంపికలో తన పాత్ర కీలకం కానుందని అఖిలేశ్ తెలిపారు. ‘వచ్చే ఎన్నికలు నాకు పరీక్ష. నేనో క్రీడాకారుడిని. ఫుట్‌బాల్, క్రికెట్ ఆడాను. సెల్ఫ్ గోల్ చేసుకోను’ అని అన్నారు. అంతకుముందు పలువురు పార్టీ  కార్యకర్తలు ‘అఖిలేశ్‌ను అధ్యక్షుడిని చేయాల’నే డిమాండ్‌తో లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. వారిపై ములాయం సింగ్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ములాయం.. నేరుగా కార్యకర్తల వద్దకు వెళ్లి ‘రెండ్రోజులుగా నెలకొన్న పరిస్థితి సద్దుమణిగించేందుకు ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఇలాంటి తమాషాలు ఇకపై కుదరవు’ అని అన్నారు.
 
 యూపీలో హంగ్!
 అతి పెద్ద పార్టీగా బీఎస్పీ ?: సర్వే
 న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాక త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలున్నాయని, విపక్ష బీఎస్పీ అతిపెద్ద పార్టీగా నిలిచే సూచనలున్నాయని ఓ సర్వే పేర్కొంది. పార్లమెంటేరియన్ పత్రిక సర్వే ప్రకారం.. ఎస్పీ కోల్పోయే  150 సీట్లను బీజేపీ, బీఎస్పీ సమానంగా పంచుకుంటాయి. బీఎస్పీకి అదనంగా 89 సీట్లు దక్కుతాయి. బీజేపీకి ప్రస్తుతమున్న 47 సీట్లకు 88 జమవుతాయి. కాంగ్రెస్‌కున్న 28 సీట్లలో 13 తగ్గుతాయి. 39% మంది అఖిలేశ్ పనితీరు బాగుందన్నారు. 28% మంది మాయావతి సీఎం కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement