అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికలు జరిగిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికలు జరిగిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో తేలింది. ఐదు దశల్లో జరిగిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27-33 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 32-38 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ 4-10 స్థానాలతోను, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8-14 స్థానాలతోను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటే.. ఈసారి అధికార మార్పిడి తథ్యమని తేల్చారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఈనెల 23వ తేదీ మంగళవారం ఉంటుంది. అదేరోజు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.