
హర్జీత్ కారు నుంచి దిగగానే ఆయన కుటుంబ సభ్యులు ఆయనపై పూల వర్షం కురించారు.
చండీగఢ్ : పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన అల్లరిమూకల దాడిలో గాయపడిన సబ్‌ఇన్‌స్పెక్టర్ హర్జీత్ సింగ్ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో ఏప్రిల్ 12న నిహంగ్(సిక్కుల్లోని ఓ వర్గం)లు హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికారు. ఆయనను వెంటనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్)కు తరలించగా వైద్య బృందం హర్జీత్ సింగ్ తెగిపోయిన చేతిని ఏడున్నర గంటలపాటు సర్జరీ చేసి విజయవంతంగా అతికించారు. (చదవండి : లాక్‌డౌన్: అడ్డొచ్చిన పోలీసు చేయి నరికేశాడు!)
చేయి రీప్లాంటేషన్ పూర్తయ్యాక.. ఆస్పత్రిలో కోలుకున్న హర్జీత్, గురువారం పాటియాలాలోని తన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి ఇతర వాహనాల్లో అతని కారును అనుసరిస్తూ ఆయన ఇంటి వరకూ వచ్చారు. హర్జీత్ సింగ్ ఇంటి ముందుకు చేరుకోగానే బ్యాండ్ బాజాలతో పాటు ఎర్ర తివాచీ పరచి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక హర్జీత్ కారు నుంచి దిగగానే ఆయన కుటుంబ సభ్యులు ఆయనపై పూల వర్షం కురించారు. విపత్కర పరిస్థితుల్లో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన హర్జీత్ సింగ్ కు సబ్ ఇన్ స్పెక్టర్ గా పదోన్నతి కల్పిస్తున్నట్లు డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే అతని కొడుకుకి కూడా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఇచ్చారు.
(చదవండి : సాహస పోలీసు.. కోలుకున్నారు)