20 కేజీల బంగారం.. 21 కార్లు, బౌన్సర్లు

Golden Baba Said I Will Hand Over The Gold To My Favourite Disciple - Sakshi

న్యూఢిల్లీ : ‘దేవుడి దయ వల్లే నా దగ్గర ఉన్న బంగారం ప్రతి ఏడు పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలించి.. నా ఆరోగ్యం సహకరిస్తే మరిన్ని యాత్రలు చేస్తానంటున్నా’రు ‘గోల్డెన్‌ బాబా’ అలియాస్‌ సుధీర్‌ మక్కర్‌. ఈ బాబా ప్రతి ఏడాది 200 కిలోమీటర్ల పాటు సాగే కన్వర్‌ యాత్ర చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కన్వర్‌ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం యాత్రలో భాగంగా ఢిల్లీ - మీరట్‌ రోడ్డులో ఉన్న ఒక రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘గోల్డెన్‌ బాబా’ మీడియాతో ముచ్చటించారు. 

ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘బంగారం, కార్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను మరణించే వరకూ వాటి మీద నా పిచ్చి ప్రేమ తగ్గదు. దేవుడు దయ వల్ల నా దగ్గర ఉన్న సంపద (బంగారం) ప్రతి ఏడాది పెరుగుతోంది. పరిస్థితులు అనుకూలించి, ముఖ్యంగా నా ఆరోగ్యం సహకరిస్తే ఇలాంటి యాత్రలు మరిన్ని చేస్తాను. మూడేళ్ల క్రితం నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చికిత్సం కోసం ముంబైలో ఉన్న అన్ని ప్రముఖ ఆస్పత్రులను సందర్శించాను. కానీ ఉపయోగం లేదు’ అన్నారు.

ఈ ఏడాది చేసే కన్వర్‌ యాత్ర 25వది. ఇదే తన చివరి కన్వర్‌ యాత్రగా ప్రకటించారు గోల్డెన్‌ బాబా. తన యాత్రా ప్రస్థానం గురించి చెప్తూ ‘నా తొలి యాత్ర పూర్తవడానికి అయిన ఖర్చు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆ సమయంలో భక్తులు పెట్టింది తింటూ, రోడ్డు పక్కన ఉండే ఆశ్రమాల్లో సేద తీరుతూ నా యాత్రను కొనసాగించాను. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం నేను నాతో పాటు ఒక ప్రత్యేక వంట మనిషిని, వాటర్‌ ప్రూఫ్ టెంట్‌ని, సిబ్బందిని తీసుకెళ్తాను. వాహానాల కోసమే దాదాపు 1. 25 కోట్లు ఖర్చు చేస్తున్నాను. వీటన్నింటి వల్ల భారీగా ఖర్చవుతుంది. అందుకే నా తొలి కన్వర్‌ యాత్ర నాకు చాలా ప్రత్యేకం అన్నారు.

గతేడాది యాత్ర సందర్భంగా ఈ బాబా 14.5 కేజీల బంగారాన్ని ధరించగా.. ఈ ఏడాది దాదాపు 20 కేజీల బంగారాన్ని ధరించారు, 21 కార్లను, బౌన్సర్లను తీసుకెళ్తున్నారు. ఈ గోల్డేన్‌ బాబా సన్యాసిగా మారకముందు ఢిల్లీలోని గాంధీ నగర్‌ మార్కెట్‌లో వస్త్రాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఈ బాబాకు ఘజియాబాద్‌లో ఒక విలాసవంతమైన భవనం ఉంది. ఈ ఆస్తుల గురించి స్పందిస్తూ ‘నా తదనంతరం ఈ ఆస్తులన్ని నా ప్రియ శిష్యునికి చెందుతాయ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బాబా దగ్గర  ఓ బీఎండబ్ల్యూ కారు, 2 ఆడీ కార్లు, రెండు ఇన్నోవాలున్నాయి. ఇవే కాక ఒక రోలెక్స్‌ వాచ్‌, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top