దత్తతకి తాజ్‌

GMR and ITC companies in Race to Tajmahal Adoption - Sakshi

పోటీపడుతున్న జీఎంఆర్, ఐటీసీ కంపెనీలు

చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్‌మహల్‌ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్‌ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. 

అలా తీసుకున్న వారు తాజ్‌  నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్‌ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్‌ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్‌ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. 

వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ?
మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్‌ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా  కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

తాజ్‌పై జీఎంఆర్‌ విజన్‌ డాక్యుమెంట్‌ 
తాజ్‌మహల్‌కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు యజమాని జీఎంఆర్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తాజ్‌మహల్‌ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్‌మహల్‌ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్‌ కారిడార్‌ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. 

మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్‌ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్‌తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్‌–ఉద్‌–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్‌ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్‌లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్‌లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా  75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.
          (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top