బాల్‌ఠాక్రేకు ఘన నివాళి

బాల్‌ఠాక్రేకు ఘన నివాళి


సాక్షి, ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ద్వితీయ వర్ధంతి సందర్భంగా శివాజీ పార్కులోని స్మారకాన్ని ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఠాక్రే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. బాల్‌ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని సోమవారం శివాజీపార్క్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే స్మారకం వద్ద అభిమానుల సందడి మొదలైంది.ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన వేలాదిమంది పార్టీ పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు బాల్ ఠాక్రే స్మారకానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. బాల్ ఠాక్రే అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్ధవ్‌ఠాక్రే కుటుంబ సభ్యులతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత పక్కనే ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులయ్యారు. కాగా, మధ్యాహ్నం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వచ్చి నివాళులర్పించిన తర్వాత ఉద్ధవ్, రాజ్ పక్కపక్కనే కూర్చున్నారు. దాదాపు 15 నిమిషాలకుపైగా ముచ్చటించారు. సోదరులిద్దరూ విడిపోయిన చాలా కాలం తర్వాత ఇలా బహిరంగంగా చాలా సేపు మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.   శ్రద్ధాంజలి ఘటించిన సీఎం..

 అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బాల్‌ఠాక్రే స్మారకాన్ని సందర్శించారు. ఠాక్రే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ఉద్ధవ్‌తో భేటీ అయ్యారు. కాని అక్కడ గుమిగూడిన శివ సైనికులు ‘ముఖ్యమంత్రి చలే జావ్’ అంటూ నినాదాలు చేసి బీజేపీపై ఉన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన తర్వాత మీడియాతో సీఎం మాట్లాడుతూ ముంబైలో బాల్ ఠాక్రే స్మారకం నిర్మించేందుకు ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌తోపాటు ఇతర పార్టీల కీలక నాయకుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు బీజేపీ నాయకులు వెళతారా..? లేదా..? వెళితే ఎవరెవరూ వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవిస్ మంత్రి వర్గంలోని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే, గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి పంకజా ముండే, ఉద్యోగ మంత్రి ప్రకాశ్ మెహతా, విద్యాఠాకూర్ తోపాటు శివసేన ఎంపీ సంజయ్ రావుత్, నాయకులు అనిల్ దేసాయి, నీలం గోర్హే, మిలింద్ నార్వేకర్‌తోపాటు ఎమ్మెన్నెస్ నాయకులు బాలా నాంద్‌గావ్కర్, నితిన్ సర్‌దేశాయి. శిశిర్ షిండే తదితర ప్రముఖులు సందర్శించారు. కాగా, ఈ రోజును ‘ప్రేరణ దివస్’ గా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఏక్‌నాథ్ షిండే అభివర్ణించారు. ఇదిలా ఉండగా, బాల్ ఠాక్రే  వర్ధంతి పురస్కరించుకుని శివాజీపార్క్ మైదానంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద సంఖ్యలో శివసైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రక్తంలో కణాలు (ప్లేట్స్) తగ్గిన వారికి ఇలా దాతల ద్వారా సేకరించిన రక్తం ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.   దగ్గరవుతున్న ఉద్ధవ్, రాజ్...

 ఠాక్రే కుటుంబం మళ్లీ దగ్గరవుతుండటం విపక్షాలకు మింగుడుపడని విషయమే.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో శివసేన, ఎమ్మెన్నెస్ విడివిడిగా పోటీచేసినా... అవసరమైతే ఉద్ధవ్‌తో కలిసి పనిచేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్‌ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం పరిణామాల్లో భాగంగా ఇటీవల రాజ్‌ఠాక్రే కుమార్తె ఊర్వశి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నప్పుడు ఉద్ధవ్‌ఠాక్రే కుటుంబ సమేతంగా వెళ్లి పరామర్శించి వచ్చారు.అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాది బాల్‌ఠాక్రే వర్ధంతి రోజున రాజ్‌ఠాక్రే శ్రద్ధాంజలి ఘటించేందుకు శివాజీ పార్క్‌కు వెళ్లలేదు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఏడాది ఆయన తన పుణే పర్యటనను సైతం వాయిదా వేసుకుని ఠాక్రే స్మారకాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఉద్ధవ్‌తో కొంత సేపు గడపటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలాఉండగా, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీల మధ్య రాజీ కుదరలేదు. పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో తమని వాడుకుని శాసన సభ ఎన్నికల్లో దూరం కొట్టిందనే భావన శివసేన నాయకుల్లో నాటుకుపోయింది. అదేవిధంగా లోక్‌సభ, ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పూర్తిగా చతికిలపడి పోయింది. దీంతో రాజకీయంగా ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకే విధంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరువురు భేటీ కావడంతో భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top