దుబే ఎన్‌కౌంటర్‌ : తీవ్ర రక్తస్రావం, షాక్‌తో మృతి

Dubey Postmortem Report Stated That Cause Of Death Was Shock Due To Firearm Injuries - Sakshi

పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి

లక్నో : ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో ప్రధాన నిందితుడు  గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే బుల్లెట్‌ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈనెల 10న దుబే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పట్టుబడగా  ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ దుబే మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం మూడు బుల్లెట్లు దుబే శరీరంలోకి దూసుకెళ్లాయి.

ఆయన శరీరంపై పది గాయాలయ్యాయని, తొలి బుల్లెట్‌ దుబే కుడి భుజానికి, రెండు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకువెళ్లాయని నివేదికలో వెల్లడైంది. దుబే తల, మోచేయి, కడుపు భాగంలోనూ గాయాలున్నట్టు నివేదిక పేర్కొంది. మహంకాళి దేవాలయంలో పూజలు చేసేందుకు ఉజ్జయిని వచ్చిన దుబేను ఈనెల 9న మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్పూర్‌కు సమీపంలోని బిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్‌ దుబే ప్రధాన నిందితుడు. దుబే ఎన్‌కౌంటర్‌తో దశాబ్ధాల పాటు సాగిన అరాచకాలకు, నేరసామ్రాజ్యానికి తెరపడిందని ఆయన స్వగ్రామం బిక్రులో స్ధానికులు సంబరాలు చేసుకున్నారు. చదవండి : రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top