ఎడారి కమ్ముకొస్తోంది

Desertification has increased in 90 per cent of states in India - Sakshi

భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో  ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్‌ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్‌ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట.  మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది.

ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం.  40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్‌ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌  14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి.  తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది.  

ఎందుకీ పరిస్థితి ?
నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా  నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు.

ఎడారిలో పూలు పూస్తాయా !
దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్‌      ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే  సంతకాలుచేసింది.  2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ పద్నాలుగో సదస్సు (కాప్‌–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్‌ మహారాష్ట్ర, నాగాలాండ్‌ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్‌ ఎడారిలో పూలు పూయించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top