breaking news
Desert country
-
ఎడారి కమ్ముకొస్తోంది
భారత దేశంలో నేలతల్లి నెర్రలు విచ్చుకుంటోంది. పచ్చదనంతో కళకళలాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన భూమి ఎందుకూ పనికి రాకుండా ఎడారిగా మారిపోతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా అంచనాలు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ నివేదిక ప్రకారం భారత్‌లో 90 శాతం రాష్ట్రాల్లో ఎడారీకరణ విస్తరించింది. దీంతో వ్యవసాయ రంగం కుదేలైపోతోంది. భారత్‌లో 328.72 మిలియన్ హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉంటే అందులో 96.4 మిలియన్ హెక్టార్ల ప్రాంతం ఎడారిగా మారిపోయింది.అంటే 30శాతం భూమి ఎందుకూ పనికి రాకుండా పోయిందన్న మాట. మొత్తం 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో గత పదేళ్లలో ఎడారి ప్రాంతం బాగా పెరిగింది. ఎనిమిది రాష్ట్రాలో పరిస్థితి మరీ ఘోరం. 40–70% ఎడారిగా మారిపోయిందని ఆ నివేదిక వెల్లడించింది.. రాజస్థాన్, ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకీ సారవంతమైన భూములు తగ్గిపోతున్నాయి. ఇక మిజోరంలో లంగ్లే ప్రాంతంలో నేల పెళుసుబారడం మరీ ఎక్కువగా పెరిగిపోతోంది. 5.8శాతంగా ఇది ఉంది. 2003–2011 మధ్యలో అత్యధికంగా1.8 మిలియన్ హెక్టార్ల భూమి ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ 14.35 శాతం , తెలంగాణలో 31.40 శాతం భూములు నిరుపయోగంగా మారాయి. ఏపీలో అనంతపురం జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో అధికంగా ఎడారీకరణ జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి ? నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, అతివృష్టి అనావృష్టి పరిస్థితుల కారణంగా ఉత్పాదక భూమి పంటలు పండడానికి అనుగుణంగా లేకపోవడాన్నే ఎడారీకరణ అంటారు. దీని కారణంగా నీటి వనరులు తగ్గిపోతాయి. మొక్కలు పెరగవు. వన్యప్రాణులకు స్థానం ఉండదు. ఎడారిలో పూలు పూస్తాయా ! దేశంలో ఎడారీకరణ తగ్గిస్తామని భారత్ ఐక్యరాజ్య సమితి సదస్సులో 1994లోనే సంతకాలుచేసింది. 2030 నాటికి వ్యర్థంగా మారిన భూముల్ని సాగుకు అనుగుణంగా చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ సెప్టెంబర్‌లో భారత్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ పద్నాలుగో సదస్సు (కాప్–14)కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు సందర్భంగా వచ్చే మూడున్నరేళ్లలోనే ఎంపిక చేసిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, నాగాలాండ్ అటవీభూముల్ని పెంచుతామని హామీ ఇవ్వనుంది. నీటి వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, భూ సార పరిరక్షణ, జీవవైవిధ్యం పెంపు వంటి చర్యల ద్వారా భారత్ ఎడారిలో పూలు పూయించనుంది. -
ఎడారిని ఎదిరించిన చెట్టు..
ఇది బహ్రెయిన్ దేశం సదరన్ గవర్నరేట్‌లో ఉన్న చెట్టు. వయసు 400 ఏళ్లు. దీని ప్రత్యేకత ఏమిటన్నదే కదా ప్రశ్న. ఈ చెట్టు ఎడారిలో ఉంది. అదీ ఒక్కటే ఉంది! ఈ ఎడారిలో ఇంత భారీ చెట్టు ఉండటమే ఒక వింత. అదీ ఇన్నేళ్లుగా.. అక్కడి ఎడారిలో చిన్నచిన్న తుప్పల్లాంటివి తప్ప.. ఇంత భారీ చెట్టన్నదే లేదట. అందుకే దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పర్యాటకులు దీన్ని చూడటానికి వస్తారు. -
సౌదీలో తెలుగు సంఘం ఏర్పాటు
దుబాయ్: ఎడారి దేశం సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు మాట్లాడే వారంతా కలిసి తొలిసారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జడ్డా(తాజ్)గా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసమే తామంతా సంఘంగా ఏర్పడినట్టు తాజ్ అధ్యక్షుడు మస్తాన్ షేక్ అరబ్ న్యూస్‌కు వెల్లడించారు. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన వారంతా కలిసి తాజ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సౌదీలో దాదాపు 4 లక్షల మంది తెలుగువారు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న నేపథ్యంలో తాజ్ ఏర్పాటు సర్వత్రా ఆసక్తిగా మారింది.