సిగ్గుతో తలదించుకుంటున్నా! | Sakshi
Sakshi News home page

సిగ్గుతో తలదించుకుంటున్నా!

Published Mon, Jan 6 2020 9:07 AM

Delhi Police lawyer questions cops on JNU violence - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్‌ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్‌ రాహుల్‌ మెహ్రా ట్విటర్‌లో స్పందించారు. గూండాలు జేఎన్‌యూలోకి ప్రవేశించి.. అమాయకులైన విద్యార్థులపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులకు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు.

‘జేఎన్‌యూలో హింసకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ చూశాక ఢిల్లీ పోలీసు స్టాండింగ్‌ కౌన్సెల్‌ అయిన నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. గూండాలు యథేచ్ఛగా జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి.. మారణహోమం సృష్టించారు. విద్యార్థులను తీవ్రంగా గాయపర్చారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బలగాలు ఏం చేస్తున్నాయి?’అంటూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు దాడి చేశారో, ఎవరు బాధితులో అన్నది సందేహముంటే.. ఎబీవీపీ లేదా వామపక్షాల విద్యార్థుల్లో ఎవరికి తీవ్రమైన గాయాలయ్యాయన్న దానినిబట్టి దానిని తేల్చవచ్చునని పేర్కొన్నారు.
చదవండి: జేఎన్‌యూలో దుండగుల వీరంగం

Advertisement
Advertisement