తెరపైకి మళ్లీ దీప

Deepa Contesting In Elections In Tamilnadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా తెరమరుగైపోయిన జయలలిత అన్న కుమార్తె దీప హఠాత్తుగా మరోసారి తెరపైకి వచ్చారు. ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై (ఎంఏడీపీ) తరఫున అన్నినియోజకవర్గాల్లో అభ్యర్థులను దించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు శని, ఆదివారాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆపార్టీలో అగాధం ఏర్పడింది. రాష్ట్రంలో రాజకీయశూన్యత నెలకొంది. జయలలితకు రక్తసంబందీకులుగా దీప, ఆమె సోదరుడు దీపక్‌ మాత్రమే మిగిలారు. జయలలిత తల్లి సంధ్య నివసించిన టీ నగర్‌లోని ఇంట్లోనే దీప నివసిస్తున్నారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం దీప ఎవ్వరికీ తెలియదు. అమ్మ మరణం తరువాత అకస్మాత్తుగా రాజకీయాలపై ఆసక్తిచూపిన ప్రజల్లోకి వచ్చారు.

అయితే అన్నాడీఎంకే తన చేతుల్లోంచి చేజారిపోకూడదని భావించిన శశికళ...దీప ప్రయత్నాలను తెరవెనుక నుంచి అడ్డుకున్నారు. అయితే అమ్మ అంటే ఎంతో అభిమానం పెంచుకున్న తమిళ ప్రజలు దీప బాహ్యరూపం కూడా అలానే ఉండడంతో జయలలితను ఆమెలో చూసుకున్నారు. అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వం విడిపోవడంతో పార్టీ రెండుగా చీలిపోతుందని, అదే సమయంలో పార్టీని తన చేతుల్లోకి తీసుకోవచ్చని దీప ఆశించారు. అయితే ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఏకంకాగా దీపకు నిరాశే మిగిలింది. ఈ పరిణామాన్ని ఊహించని దీప వెంటనే ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై పేరుతో పార్టీని స్థాపించారు. అన్నాడీఎంకే నుంచి కొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు పేరవైలో చేరారు. అయితే ఎంతవేగంగా చేరారో ఆదే వేగంతో వెళ్లిపోయారు. దీప వ్యవహారశైలి, భర్త మాధవన్‌ తగాదాలు మిన్నంటాయి. పేరవైలోని అగ్రనేతలు భార్యాభర్తలకు నచ్చజెప్పడం తలనొప్పిగా మారింది. చివరకు మాధవన్‌ సైతం దీపతో విభేదించి వేరు పార్టీ పెట్టారు. ఇలా వరుస పరిణామాలతో దీప ఉనికే లేకుండా పోయింది.

ఎన్నికల వేళ..
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఎన్నికల వేడిరాజకుని ఉన్న స్థితిలో దీప అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చారు. 40 పార్లమెంటు స్థానాలు, ఉప ఎన్నికలు జరిగే 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడీపీ అభ్యర్థులను పోటీపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆశావహుల నుంచి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తానని శుక్రవారం ప్రకటించారు. దీప సైతం పోటీచేస్తారని సమాచారం. అయితే ఎంఏడీపీ ఒంటరిపోరా, ఏదైనా కూటమితో చేతులు కలుపుతారా అనేది స్పష్టం కాలేదు. రాష్ట్రంలోని రెండుకూటములు ఎవరి వ్యూహాల్లో వారుండగా ఉరుములేని పిడుగువలె దీప రంగంలోకి దిగడం అన్ని పార్టీలనూ ఆలోచనలో పడేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top