‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్‌

The country did not forget the Pulwama incident - Sakshi

గుర్‌గావ్‌: ‘పుల్వామా ఘటనను దేశం మరిచిపోలేదు, మర్చిపోదు. ఇటువంటి చర్యలపై దేశ నాయకత్వం సమర్థంగా, దీటుగా బదులిస్తుంది’ అని జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ అన్నారు. సీఆర్‌పీఎఫ్‌ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్‌ మాట్లాడారు.  ఈ సందర్భంగా పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు నివాళులర్పించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. అమరులైన జవాన్లు, వారి కుటుంబాలకు దేశం ఎన్నడూ రుణ పడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘మీరు నిండైన ఆత్మస్థైర్యంతో ఉంటే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. చరిత్ర చెప్పేది కూడా ఇదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనమైన అంతర్గత రక్షణ వ్యవస్థలున్న 60 వరకు దేశాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం, సార్వభౌమత్వం కోల్పోవడం వంటివి సంభవించాయి’ అని తెలిపారు.

దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్‌పీఎఫ్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాల నుంచి యుద్ధ క్షేత్రాలకు సత్వరం తరలివెళ్లి బాధ్యతలు చేపట్టడంలో సీఆర్‌పీఎఫ్‌ ముందుందని కొనియాడారు. దేశంలో భద్రతాపరమైన సవాళ్లు తలెత్తిన ప్రతిచోటా సీఆర్‌పీఎఫ్‌నే కీలకంగా ఉంటుందని చెప్పారు. గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను ఈ సందర్భంగా దోవల్‌ జవాన్లకు అందజేశారు. కాగా, 1939లో బ్రిటిష్‌ పాలనలో ‘క్రౌన్‌ రిప్రజెంటేటివ్స్‌ పోలీస్‌’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్‌పీఎఫ్‌గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top