కరోనా: డబ్లింగ్‌ కాలం పెరగపోతే 8 లక్షల కేసులు!

Coronavirus Cases In Ahmedabad May Have 8 Lakhs By May End - Sakshi

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2,624 కేసులతో గుజరాత్‌ దేశంలో రెండో స్థానంలో ఉండగా.. ఒక్క అహ్మదాబాద్‌ నగరంలోనే 1638 పాజిటివ్‌ కేసులు ఉండటం విశేషం. ఈక్రమంలో అహ్మదాబాద్‌లో ప్రతి నాలుగు రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని నగర మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ నెహ్రా శుక్రవారం వెల్లడించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. మే 15 వరకు కేసుల సంఖ్య 50 వేలకు చేరి..  మే నెలాఖరుకు 8 లక్షలకు చేరుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పటిష్ట చర్యలు, ప్రజల సహకారంతో కేసుల డబ్లింగ్‌ కాలాన్ని పెంచుతామని అన్నారు.
(చదవండి: ఎయిమ్స్‌లో న‌ర్సుకు క‌రోనా)

‘కరోనాను కట్టడి చేయాలంటే..  కేసుల రెట్టింపు కాలాన్ని నాలుగు రోజుల నుంచి 8 రోజులకు పెంచడం ఒక్కటే మార్గం. అయితే, అది కష్టంతో కూడుకున్న పని. ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే అందులో విజయం సాధించాయి. యూఎస్‌, ఇటలీలో కేసుల రెట్టింపు కాలం నాలుగు రోజులు. దక్షిణ కొరియాలో మాత్రమే 8 రోజులు. కేసుల రెట్టింపు కాలాన్ని పెంచడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం.  ప్రజల సహకారంతో విజయం సాధిస్తామనే నమ్మకముంది. ఒకవేళ కేసుల రెట్టింపు కాలం 8 రోజులకు పెరిగితే, మే 15 వరకు 10 వేల కేసులు మాత్రమే నమోదవుతాయి. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ముగిసే మే 3 వరకు తాము లక్ష్యం చేరుకోవాల్సి ఉంటుంది’అన్నారు. కాగా, అహ్మదాబాద్‌లో కరోనా కారణంగా 75 మంది మృతి చెందగా.. 105 మంది రికవరీ అయ్యారు. 1459 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
(చదవండి: రంజాన్‌ నెల.. ‘ఆజాన్‌’పై నిషేధం లేదు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top