పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం

Citizenship Amendment Bill-2019 passed in Lok Sabha - Sakshi

లోక్‌సభలో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు

సభలో వాడివేడి చర్చ

సుదీర్ఘ సమాధానమిచ్చిన అమిత్‌ షా

భారతీయ ముస్లింలకు ఈ బిల్లుతో సంబంధం లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌ నిర్వహించారు. ఓటింగ్‌లో అనుకూలంగా  311, వ్యతిరేకంగా 80 ఓటేశారు. దాంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. అంతకుముందు, పలువురు ఎంపీల సవరణ ప్రతిపాదనలను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది.

ఈ బిల్లుపై సభలో దాదాపు 7 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం, చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్‌ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు.  ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్‌ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్‌
రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించే ప్రసక్తే లేదని అమిత్‌ షా మరోసారి తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చి, బాధాకర జీవనం గడుపుతున్నవారికి ఊరట కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. 1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి ఉండకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు అవసరమే ఉండేది కాదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్‌ 31 లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులను అక్రమ శరణార్ధులుగా భావించం. వారికి భారత పౌరసత్వం కల్పిస్తాం’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల సంప్రదాయమైన ఆత్మీయీకరణ, మానవీయతలో భాగంగానే ఈ బిల్లు రూపొందిందన్నారు.

డివిజన్‌ ఓట్‌తో..  
అంతకుముందు, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లును అమిత్‌ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, మతహింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ప్రతిపాదనకు 130 కోట్ల భారతీయుల ఆమోదం ఉందని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. డివిజన్‌ ఓట్‌ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డివిజన్‌ వోట్‌లో అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.  రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమని విపక్ష సభ్యులు ఆధిర్‌ రంజన్‌ చౌధురి(కాంగ్రెస్‌), సౌగత రాయ్‌(టీఎంసీ), ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌(ఆర్‌ఎస్‌పీ), గౌరవ్‌ గొగొయి(కాంగ్రెస్‌), శశిథరూర్‌(కాంగ్రెస్‌), అసదుద్దీన్‌ ఒవైసీ(ఎంఐఎం) తదితరులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెడ్తూ.. కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. ‘శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య తేడాను మనమంతా గుర్తించాల్సి ఉంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.ఎవరి హక్కులనూ లాక్కోదు’ అని అన్నారు.  

‘ఇన్నర్‌ లైట్‌ పర్మిట్‌’లోకి మణిపూర్‌
ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్‌ కార్డ్‌ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు.

గతంలోనూ ఇలాంటి హక్కులు కల్పించారని, ఆ కారణంగానే ప్రస్తుత పాకిస్తాన్‌ నుంచి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ ప్రధాని, ఎల్‌కే అడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది.  ఈ బిల్లు లౌకికత అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ విమర్శించారు. ‘సమానులను సమానం కాని వారుగా గుర్తించకూడదు. భారత్‌కు ఎవరు వచ్చినా వారు శరణార్ధులే.

మతం ప్రాతిపదికన వారిని వేరువేరుగా చూడకూడదు’ అన్నారు. బిల్లుకు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ముస్లింలను కూడా చేర్చాలని, బిల్లుకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్‌ సూచించాయి. ఈ బిల్లును వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్‌ సభ్యుడు ఆధిర్‌ రంజన్‌ చౌధురి విమర్శించారు. ‘ఈ బిల్లు వివక్షాపూరితం. రాజ్యాంగ పునాదులనే ఇది దెబ్బతీస్తుంది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇది తొలి అడుగు’ అని మండిపడ్డారు.  

మా రాష్ట్రంలో ఒప్పుకోం: మమత... ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ఆందోళనలు ఊపందుకున్నాయి.

బిల్లు ప్రతిని చించేసిన ఒవైసీ
పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. తన ప్రసంగం చివరలో ఈ బిల్లు ప్రతిని చించేశారు. ‘ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం ఎన్‌ఆర్సీలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేయడం వీరి ఉద్దేశం. రెండోసారి విభజన జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది’ అంటూ ప్రతిని చించేసి తన ప్రసంగాన్ని ముగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top