సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి

Centre govt releases guidelines for opening of hotels and restaurants - Sakshi

రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌కు మార్గదర్శకాలు జారీ

కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్‌ఓపీ)ని గురువారం విడుదల     చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్‌ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి.  

సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే..
రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్‌ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్‌ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి  వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్‌) చేయాలి. అతిథులు, హోటల్‌ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్‌/మొబైల్‌ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్‌ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్‌ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలి.   

మాస్కులు ధరిస్తేనే అనుమతి  
షాపింగ్‌ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్‌ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్‌ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్‌ మాల్‌ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్‌మెంట్‌ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి.

మార్కింగ్‌ చేయాల్సిందే
హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్‌ లోపల, బయట మార్కింగ్‌ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నడిచేలా చూడాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top