రహదారులకు మరో 1,750 కోట్లు | Central Government Funds To Roads In Telangana | Sakshi
Sakshi News home page

రహదారులకు మరో 1,750 కోట్లు

May 6 2018 1:35 AM | Updated on Aug 30 2018 4:49 PM

Central Government Funds To Roads In Telangana - Sakshi

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రహదారుల నిర్మాణం కోసం కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్‌) కింద ఈ ఏడాది అదనంగా రూ.1,000 కోట్లు ఇస్తామని.. ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.750 కోట్లు అందజేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. అతి తక్కువ ఖర్చుతో రవాణాకు వీలు కల్పించే జల రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ వరకు గోదావరిపై జల రవాణా మార్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.2 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టనున్నామని వెల్లడించారు. ప్రజా రవాణాను మెరుగైన రీతిలో ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని.. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో రూ.1,523 కోట్లతో చేపట్టనున్న నాలుగు రోడ్డు ప్రాజెక్టులకు గడ్కరీ శనివారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్‌– బెంగళూరు జాతీయ రహదారి–44 పరిధిలోని ఆరాంఘర్‌– శంషాబాద్‌ సెక్షన్‌ను ఆరు లేన్ల రహదారిగా విస్తరించడం, ఎన్‌హెచ్‌–765డి లో ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి మెదక్‌ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్‌పేట క్రాస్‌రోడ్స్‌ వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం, ఎన్‌హెచ్‌ 163లో ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల శిలాఫలకాలను గడ్కరీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ‘‘తెలంగాణలోని ఎలివేటెడ్‌ రోడ్డు ప్రాజెక్టులపై తప్పుడు నివేదికలు అందాయి. దాంతో వాటిని పక్కనపెడితే.. రాష్ట్రం నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు, మా (బీజేపీ) ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు చాలాసార్లు తిరిగారు. ఫ్లైఓవర్‌ మంజూరు చేస్తేనే ఇక్కడ్నుంచి పోతానని కిషన్‌రెడ్డి నా కార్యాలయంలో కూర్చున్నారు. దాంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేశాం’’అని గడ్కరీ పేర్కొన్నారు. 

జల రవాణాతో మూడు రాష్ట్రాలకు ప్రయోజనం 
సుదీర్ఘ పరీవాహక ప్రాంతం ఉన్న గోదావరి నదిలో జలరవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం డీజిల్‌ వాహనాల్లో కిలోమీటరు ప్రయాణ ఖర్చు రూ.10గా ఉంది. రైలు ప్రయాణం రూ.6గా ఉంది. అదే నీటిపై ప్రయాణం కిలోమీటరుకు కేవలం ఒక రూపాయి మాత్రమే. ఇంత తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తాం. ఇది నా కలల ప్రాజెక్టు. మూడు రాష్ట్రాలు సమన్వయంతో ఉంటేనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం (ఫీజిబులిటీ స్టడీ) దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలోనే డీపీఆర్‌లు సిద్ధం చేస్తాం. ఆలోపు మూడు రాష్ట్రాల ప్రతినిధులను తీసుకెళ్లి ప్రాజెక్టుపై అవగాహన కల్పిస్తాం..’’అని గడ్కరీ తెలిపారు. 

బ్యారేజీలపై చర్చించి నిర్ణయం.. 
గోదావరి నదిపై మరో బ్యారేజీ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ తనకు చెప్పారని.. దానిని పరిశీలించి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గడ్కరీ చెప్పారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం అంత సులువైన విషయం కాదని పేర్కొన్నారు. నదీ జలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్‌ తనకు చాలాసార్లు చెప్పారని.. ప్రస్తుతానికి సమయం లేనందున మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా చూసివెళ్తానని తెలిపారు. 

జనాభాను క్రమబద్ధీకరించాలి 
హైదరాబాద్‌లో జనాభాను క్రమబద్ధీకరించాలని.. నగరానికి చుట్టూ నాలుగైదు మినీ పట్టణాలు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు నిర్మించాలని గడ్కరీ సూచించారు. ‘‘జనాభా మొత్తం ఒకే చోట పెరిగితే చాలా ఇబ్బందులుంటాయి. మా ముంబై నగరమే అందుకు ఉదాహరణ. కిక్కిరిసిన జనాభాతో కనీసం ప్రశాంతంగా నడవలేని పరిస్థితి ఉంది..’’అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రజారవాణాను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌లతో నడిచే వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోందని.. అది మానవాళి మనుగడకే ప్రమాదమని గడ్కరీ చెప్పారు. అందువల్ల ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటున్నామని.. అదే ఇథనాల్, మిథనాల్‌ లాంటి ఇంధనాన్ని వాడితే దేశానికి దిగుమతుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. రైతుల పండించే పంటల ఉప ఉత్పన్నాల నుంచి వచ్చే ఇథనాల్, మిథనాల్‌ వినియోగంతో.. వారికి కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. 

54 కూడళ్లలో ఫ్లైఓవర్లు, స్కైవేలు: కేటీఆర్‌ 
హైదరాబాద్‌లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణ జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని 54 కూడళ్ల వద్ద ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్యాట్నీ, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సుచిత్ర మీదుగా ఏర్పాటు చేసే ఎలివేటెడ్‌ రోడ్డు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరిస్తోందని... కానీ అక్కడ రక్షణశాఖ భూముల వివాదం ఉందని పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే ఈ సమస్య తీరుతుందన్నారు. 

గడ్కరీ ఇచ్చిన హామీలివీ.. 
– అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్‌ను మరో 200 మీటర్లు పొడిగిస్తామని, ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించాలని గడ్కరీ హామీ ఇచ్చారు. పెంచిన నిడివిలో భూసేకరణ బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 
– హైదరాబాద్‌ మహా నగరం చుట్టూ ఏర్పాటు చేసే రీజినల్‌ రింగురోడ్డుకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.5500 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని.. త్వరగా ప్రాజెక్టు రిపోర్టు సమర్పిస్తే చర్యలు చేపడతామని తెలిపారు. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకర్‌పల్లి, కంది మీదుగా 338 కిలోమీటర్ల పొడవున రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. 
– ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ (సీఆర్‌ఎఫ్‌) పద్దు కింద రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.750 ఇస్తామని గడ్కరీ ప్రకటించారు. 
– జల రవాణా పథకం కింద గోదావరి నదిపై మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పరిధిలో 1,400 కిలోమీటర్ల పొడవున జలరవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రూ.2 వేల కోట్లు ఇస్తామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement