ఉన్నావ్‌ కేసు: సీబీఐ విచారణ ముమ్మరం

CBI Raids In UP on Unnao Case - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ యాక్సిడెంట్‌ కేసుపై సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే ఉన్నావ్‌ అత్యాచార నిందితుడు కుల్దీవ్‌ సెగార్‌ ఉంటున్న సితాపూర్‌ జైలులో కూడా అధికారుల సోదాలు నిర్వహించారు. జైలు రికార్డులను పరిశీలించి.. ఇటీవల కాలంలో ఆయన్ను కలవడానికి ఎవరెవరు వచ్చారని జైలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచరుల ఇళ్లల్లో కూడాసోదాలు చేపట్టారు. ఈ కేసులో 45 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణలో సీబీఐ మరింత వేగం పెంచింది. ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తోంది.

ట్రక్‌ డ్రైవరు ఆశిష్‌ కుమార్‌ పాల్, క్లీనర్‌ మోహన్‌లకు కోర్టు మూడు రోజుల పోలీస్‌ కస్టడీని విధించిన విషయం తెలిసిందే. ట్రక్‌ యజమానిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఈ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనం నెంబర్‌ కనబడకుండా గ్రీస్‌ పూసారని తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం గం. 05.20లకు ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలో ట్రక్కు నంబర్‌ ప్లేట్‌పై ఎలాంటి మచ్చలు, మరకలు గానీ లేని విషయం బహిర్గతమైంది.

దీంతో ఈ ప్రమాదం కావాలనే చేశారనే వాదనకు బలం చేకూరినట్టైంది. ఈ విషయం వాహన యజమానిని ప్రశ్నించగా, ఈఎమ్‌ఐలు కట్టకుండా తప్పించుకోవడానికి తరచూ అలా చేస్తుంటామని చెప్పడం గమనార్హం. కాగా కారు​ ప్రమాదంలో గాయపడిన అత్యాచార బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత న్యాయవాది కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top