మోదీ ప్రచారంతో భారత్‌కు అప్పులు!

cause behind the fiscal deficit - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేసుకునేందుకు అదనంగా మరో 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ద్రవ్యలోటును స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 3.2 శాతంగా చూపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి ద్రవ్యలోటును మూడు శాతానికి కుదిస్తామని హామీ ఇచ్చింది. అలాంటిది అదనంగా 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరానకి ద్రవ్యలోటు మూడు శాతానికి తగ్గాల్సిందిపోయి 3.5 శాతానికి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై పెద్ద ఆశ పెట్టుకుంది. దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా ప్రభుత్వానికి మిగిలినట్టేనని ఊహించింది. వాస్తవానికి రద్దు చేసిన మేరకు డబ్బంతా వచ్చి ఆర్బీఐకి చేరడంతో కంగుతిన్న ప్రభుత్వం ఆర్థిక లోటును దాచేసేందుకు కొత్త దారులు వెతికింది. అత్యవసరంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అమలు చేయడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక వనరులు వచ్చి ఖజానా నిండుతుందని  భావించింది. జీఎస్టీ అమల్లో ఎన్నో అవరోధాలు, గందరగోళం ఏర్పడడంతో ఆశించిన స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరలేదు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతాయనుకుంటే పెరుగుతుండడం ఆర్థిక శాఖకు మరో దెబ్బ. అందుకని పన్నులను తగ్గించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను తాజాగా కోరింది. ఏదేమైనా ఈ ఏడాది చమురు కోసం అదనంగా 15 శాతం నిధులు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో దేశ ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంటూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి మరుతోంది. ఈ ఏడాది జీడీపీ రేటు 5.7 శాతానికి తగ్గడం కూడా ఆర్థికంగా ఎంతో దెబ్బ. జీఎస్టీని అమలు చేసిన తొలి నెలల్లో నెలకు జీఎస్టీ కింద కేంద్రానికి 91వేల కోట్ల రూపాయలు రాగా, నవంబర్‌ నెలకు 80,808 కోట్ల రూపాయలే వచ్చాయి. వివిధ వర్గాల ఒత్తిళ్లుకు జీఎస్టీ రేట్లను తగ్గించడం ఇందుకు కారణమని తెలుస్తోంది.

నరేంద్ర మోదీ మానసిక పుత్రికా రత్నమైన ‘స్వచ్చ్‌ భారత్‌’ లాంటి పథకాల ప్రచారానికి, ఆయన విదేశీ యాత్రలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, వాటిని తగ్గించుకున్నట్లయితే ఇప్పుడు అదనంగా 50 వేల కోట్ల రూపాలను అప్పుగా తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014, జూన్‌ 15వ తేదీతో ఆయన విదేశీ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ రోజున ఆయన బూటాన్‌కు వెళ్లినప్పటి నుంచి 2016, నవంబర్‌ 10వ తేదీ మధ్య ఆయన 27 ట్రిప్పుల్లో 44 దేశాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విమానాల అద్దెకే 275 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ ఏడాది జరిపిన యాత్రల ఖర్చుగానీ, ఆయన బస చేసిన హోటళ్లకు అయిన ఖర్చుగానీ అందుబాటులో లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top