ఈ బియ్యాన్ని వండక్కర్లేదు | This Boka rice needs no cooking | Sakshi
Sakshi News home page

Aug 26 2018 11:47 AM | Updated on Aug 26 2018 11:55 AM

This Boka rice needs no cooking - Sakshi

అన్నం వండాలంటే బియ్యాన్ని నానబెట్టాలి.. తర్వాత వాటిని పొయ్యిపై పెట్టి వండాలి. అప్పుడే అన్నం తయారవుతుంది. అయితే అసోంలో లభించే ఓ రకం బియ్యాన్ని వండక్కర్లేదు. కొద్దిసేపు నానబెడితే చాలు.. వండకుండానే ఎంచక్కా తినేయొచ్చు. అక్కడ మాత్రమే పండించే బొకా చావల్‌ రకం బియ్యం ప్రత్యేకత అదే. ఈ బియ్యాన్ని మడ్‌రైస్‌ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఆ బియ్యానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా జీవవైవిధ్యం ఉన్న పంటలను సాగుచేస్తారు. పెరటిలోనే కూరగాయలు, పండ్లు పెంచుతారు. ప్రతీ ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉంటుంది. అందులో చేపలు పెంచుతారు. తక్కువ విస్తీర్ణం ఉన్న భూముల్లోనే అనేక రకాల పంటలను సాగు చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకత.

ఏమిటీ బొకా చావల్‌..
అసోంలోని నల్‌బారీ, బార్‌పేట, గోల్‌ప్రా, కామ్‌రూప్, ధరాంగ్, దూబ్రే, చిరాంగ్‌ ప్రాంతాల్లో ఈ బొకా చావల్‌ను జూన్‌–డిసెంబర్‌ మధ్యలో సాగు చేస్తారు. 17వ శతాబ్దంలో మొఘలాయిలతో తలపడే సైనికుల కోసం ఈ బియ్యాన్ని ఉపయోగించేవారు. ఈ బియ్యా న్ని వండేందుకు ఇంధనం కూడా అవసరం లేదు. దీంతో ఈ బియ్యా న్ని వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర సమయాల్లో చాలా సులువుగా వినియోగించవచ్చు. ఈ బియ్యాన్ని నీటిలో ఓ గంటసేపు నానబెడితే చాలు ఉబ్బి అన్నంలా మారుతాయి. ఇందులో ఎక్కువ శ్రేణి రకం బియ్యాన్ని పావుగంట నానబెడితే చాలు.. అన్నం తయారవుతుంది. ఈ బియ్యాన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అసోంలో అతిథులకు వడ్డిస్తారు. ఈ బియ్యం అక్కడి ప్రజల ఆచారంలో భాగమైపోయాయి.

పోషకాలు అధికం
బొకా చావల్‌ బియ్యంలో పోషకాలూ అధికంగానే ఉంటాయి. ఈ బియ్యంలో 10.73 శాతం పీచుపదార్థాలు, 6.8 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు గువాహటి యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ చేసిన అధ్యయనంలో తేలింది. ఈ బియ్యాన్ని వాడటం వల్ల మనిషి శరీరంలోని వేడి కూడా తగ్గుతుందని వెల్లడైంది. వీటి మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పంటను ఎరువులు, పురుగు మందులు వాడి పండిద్దామనుకుంటే అసలుకే మోసం వస్తుంది. పంట పండకపోగా, మొత్తం నాశనమైపోతుందట. ఎలాంటి రసాయనాలు వాడరు కాబట్టి ఆరోగ్యానికి ఎంతగానో మేలు. అయితే ఈ బియ్యాన్ని రైతులు ప్రస్తుతం తమ అవసరాల కోసమే పండిస్తున్నారు. సరిపడా మార్కెట్‌ ఉంటే దీన్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో విస్తృతంగా పండించే అవకాశం ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement