ఢిల్లీలో బీసీల ‘హక్కుల’ ధర్నా | BC's rights group dharna in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బీసీల ‘హక్కుల’ ధర్నా

Aug 20 2013 4:22 AM | Updated on Sep 1 2017 9:55 PM

ఢిల్లీలో బీసీల ‘హక్కుల’ ధర్నా

ఢిల్లీలో బీసీల ‘హక్కుల’ ధర్నా

బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు కలిసిరాని రాజకీయ పార్టీలను వదిలిపెట్టబోమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. బీసీల అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించే వరకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

సాక్షి, న్యూఢిల్లీ: బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు కలిసిరాని రాజకీయ పార్టీలను వదిలిపెట్టబోమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టంచేశారు. బీసీల అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించే వరకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను ఐక్యపరుస్తామని, ఢిల్లీ పీఠం కదిలేలా 10 లక్షల మందితో పార్లమెంటును ముట్టడిస్తామని వెల్లడించారు.
 
 బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం బారికేడ్లు దాటి పార్లమెంటు వైపు ప్రదర్శనగా వెళుతున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం బీసీలను బిచ్చగాళ్లను చేసిందని ధ్వజమెత్తారు. ప్రధాని, సీఎం, మంత్రులుగా బీసీలు ఉంటే బిచ్చమడిగే పరిస్థితి రాదన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరుమెదపడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
 బీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, కేంద్రస్థాయిలో బీసీలకు ఉప ప్రణాళిక ఏర్పాటు చేసి రూ.50 వేల కోట్లు బడ్జెట్‌ను కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై క్రీమీలేయర్ నిబంధన ఎత్తివేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కోటా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్ష నేత యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బీసీల ధర్నాకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు. బీసీలకు ఉప ప్రణాళిక, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై పార్లమెంటులో బీజేపీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, అల్మన్‌రాజు, గుజ్జ కృష్ణ, మల్లేష్ యాదవ్, కృష్ణ పూజారి, ర్యాగ రమేష్, సురేష్, బాషా, కర్నూలు రాంబాబు, లక్ష్మీకాంతం, లక్ష్మీ, వి.సత్యనారాయణ, సదానందం, నర్సింహ నాయక్, రాజేందర్, పాండు, మధుసూధన్, సంబా సురేందర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement