ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఈ నెల 6న చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన చిత్రమిది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలు ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య ఇరుక్కుపోయింది
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఈ నెల 6న చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన చిత్రమిది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కాలు ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. దీంతో రైల్లోని ప్రయాణికులంతా కలిసి ఏకంగా రైలునే ఓ పక్కకు వంపి, అతని కాలు బయటకు వచ్చేలా చేశారు. మరుసటి రోజే అస్ట్రేలియా పౌరుల్లో ఉన్న చైతన్యం గురించి, పరోపకార గుణం గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలు ‘కమ్యూనిటీ వర్క్, పీపుల్ పవర్ వంటి శీర్షికలతో ప్రత్యేకంగా ప్రచురించి, ప్రశంసించాయి.
ఇక ఈ చిత్రం చూడండి... ఆగస్టు 2న దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓఖ్లా మెట్రోస్టేషన్‌లో చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించినది. అనిల్‌కుమార్ అనే వ్యక్తి మెట్రో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు అతను రైలుకు ఎదురుగా ఎందుకు వెళ్తున్నాడనే ఆలోచన కూడా కనీసం చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత చేతులు ముడుచుకొని తలోవైపు చూస్తున్న మెట్రో అధికారులు, దుర్ఘటన దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులు మరోవైపు కనిపించారు. మరికొందరైతే ప్రమాదం జరిగిందని తెలిసినా కనీసం రైల్లో నుంచి దిగకుండా తమ పని తాము చేసుకోవడం కనిపించింది.
న్యూఢిల్లీ: అనిల్‌కుమార్ ఆత్మహత్య ఘటనను కూడా మరుసటి రోజు పత్రికలు ప్రచురించాయి. ఆస్ట్రేలియా ఘటనలో ప్రయాణికుల చొరవను ప్రశంసించిన పత్రికలు ఢిల్లీ ఘటనలో ప్రయాణికుల నిర్లక్ష్యవైఖరిని ఎండగట్టాయి. అయినా ప్రయాణికుల తీరులో ఎటువంటి మార్పు కనిపించడంలేదు. సాటి మనిషి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నా అతణ్ని గమనించలేనంత బిజీగా జీవితాన్ని గడిపేస్తున్నారు.
ఈ విషయమై నగరానికి చెందిన సైకాలజిస్టు చందనా చతుర్వేది మాట్లాడుతూ... అనిల్‌కుమార్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్ని ప్రయాణికులు ఎవరూ గుర్తించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకోకపోయినా ప్రమాదం తర్వాత అయినా అతణి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకపోవడం దారుణమైన విషయం. పైగా రైలు చక్రాల కింద ఇరుక్కుపోయిన అత ణ్ని బయటకు తీసేందుకు వచ్చిన మెట్రో సిబ్బందికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిని కలిగించారు. క్షతగాత్రుడిని బయటకు తీస్తున్న దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరిస్తూ సహాయ చర్యలకు అడ్డుపడ్డారు. అప్పటికే అనిల్‌కుమార్ మరణించాడు. అయితే అతను ప్రాణాలతో ఉండి ఉంటే... మెట్రో ప్రయాణికులు వ్యవరిస్తున్న తీరుతో అతణ్ని ఆస్పత్రికి తరలించడం కూడా ఆలస్యమయ్యేది.
సహాయ చర్యలకు ఆటంకం కలిగించవద్దని మెట్రో అధికారులు పదే పదే అనౌన్స్ చేస్తున్నా అక్కడున్న ప్రయాణికులు పక్కకు జరగకపోవడం, సిబ్బందికి అడ్డుగా రావ డం వంటి దృశ్యాలు ఢిల్లీ ప్రయాణికుల్లో ఉన్న అవగాహన లోపాన్ని కళ్లకు కట్టాయి. ఇక మరికొంతమంది ప్రయాణికులు కనీసం బోగీలో నుంచి కూడా బయటకు రాలేదు. తాము ప్రయాణిస్తున్న రైలు కిందే పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసినా వారు రైలు కదిలేదాకా అందులోనే కూర్చున్నారు.
వీరి వైఖరి చూస్తుంటే.. ఎవరికి ఏం జరిగితే మాకెందుకులే.. అనే ధోరణిలో ఉన్నట్లు కనిపించింది. వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలుకు ఎదురుగా వెళ్తున్నప్పుడే ప్రయాణికులు గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఓ ప్రాణం నిలిచేది. ఆ తర్వాత అయినా రైలుకింద పడిన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సహకరించాల్సింది పోయి సెల్‌ఫోన్లలో ఫొటోలు తీయడం వంటి చర్యలను సిగ్గుచేటు చర్యలుగా భావించాలి.
ఇక రైల్లోనుంచి కదల్లేని వ్యక్తులో మానవత్వం పూర్తిగా మంటగలిసి పోయిందని భావించాలి. ఎదుటివారికి ఏం జరిగినా పట్టించుకోకుండా పోయే సన్నివేశాలు నగరంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కనిపిస్తాయి.మెట్రో నగరాల్లో మాత్రమే కనిపిస్తున్న ఈ సంస్కృతి ఇప్పుడు పట్టణాలకు కూడా క్రమంగా వ్యాపిస్తోంది. అయితే పల్లెల్లో మాత్రం ఎదుటివారికి సాయం చేసే మానవత్వ విలువలు ఇంకా బతికే ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం.