ఎయిడ్స్‌ బాధితులపై ఆధార్‌ పిడుగు

Aadhar card linkeup With HIV Aids Victims - Sakshi

 ఉచిత ఔషధాలు, సాయం పొందాలంటే లింకప్‌ చేసుకోవాలి

తమ వివరాలు బయటపడతాయని బాధితుల భయం

నమోదు చేసుకోక చేయూతకు దూరం

సాక్షి, బెంగళూరు: గోరుచుట్టపై రోకటి పోటులా ఉంది ప్రభుత్వాల నిర్ణయం. అసలే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే.. ఆధార్‌తో లింకప్‌ అని అధికారులు ఎయిడ్స్‌ బాధితులను వేధిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నియంత్రణ చర్యల్లో వెసులుబాటు లేక ఈ సమస్య తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఏఆర్‌టీ సెంటర్ల ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులకు ఉచితంగా నెలవారి మందులు, ఆర్థిక సాయం అందజేస్తోంది. నెలకు రూ.5 వేల విలువైన మందులను, ధనశ్రీ పథకంలో భాగంగా రూ.50వేల రుణాలను ఇవ్వడమే కాకుండా అందులో రూ.20 వేలను సబ్సిడీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సదరు సదుపాయాలు పక్కదారి పట్టకుండా ఉండటం కూ డా లబ్ధిదారులు కచ్చితంగా తమ ఆధార్‌ను ఏ ఆర్‌టీ సెంటర్లలో అందజేయాలని ప్రభుత్వం 2016 అక్టోబర్‌లో సూచించింది.

అయితే రాష్ట్రం లో ప్రస్తుతం హెచ్‌ఐవీతో బాధపడుతున్న దా దాపు 1.64 లక్షల మందిలో 50,413 మంది మాత్రమే తమ ఆధార్‌ను ఏఆర్‌టీ సెంటర్లలో అందజేశారు. మిగిలిన వారు తమ విషయాలు ఎక్కడ బహిర్గతమవుతాయో అన్న అనుమానంతో ఆధార్‌ను ఇవ్వడం లేదు. అంతేకాకుండా మందులతో పాటు ధనశ్రీ వంటి పథకాల ప్ర యోజనాలను పొందడానికి ఇటీవల ముందుకు రావడం లేదు. దీంతో బాధితుల ప్రయోజనాల కు విఘాతంతో పాటు ఎయిడ్స్‌వ్యాప్తి చెందే ప్ర మాదమూ ఉందని ఒక స్వచ్ఛందసంస్థ ప్రతి నిధి వాపోయారు. ‘ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆధార్‌ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ఏఆర్‌టీ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఈ పరిస్థితి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది’ అని తెలిపారు.

సీడీ కౌంట్‌తో ఔషధాలకు ముడి.. బలైన వేల ప్రాణాలు
2007లో అమల్లోకి వచ్చిన నిబంధనలను అనుసరించి హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి సీడీ–4 కౌంట్‌ 350కు పడిపోయిన తర్వాత మాత్రమే ఉచిత యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ)కు అర్హులు. మిగిలిన వారు సొమ్ములు చెల్లించి మందులు కొనుక్కోవాల్సి వచ్చేది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మాత్రం ఈ నిబంధనలో మార్పు వచ్చింది. సీడీ–4 కౌంట్‌తో సంబంధం లేకుండా ఏఆర్‌టీ సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారి అందరికీ ఉచితంగా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా గత పదేళ్లలో హెచ్‌ఐవీ బారిన పడి కర్ణాటకలో 80,173 మంది మరణించారు. అయితే వీరిలో దాదాపు 40 శాతం మంది ఏఆర్‌టీ సెంటర్ల ద్వారా మందులు పొందలేకపోయినవారేనని కర్ణాటక స్టేట్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ (కేఎస్‌ఏపీఎస్‌) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనల సరళీకరణ నిర్ణయం ముందే వెలువడి ఉంటే హెచ్‌ఐవీ వ్యాప్తిని మరింతగా అడ్డుకట్టువచ్చునని అధికారులే ఒప్పుకుంటున్నారు.

పసిబిడ్డలకు శుభవార్త
కర్ణాటకలో హెచ్‌ఐవీతో బాధపడుతున్న గర్బిణిల నుంచి వారికి పుట్టబోయే పిల్లలకు హెచ్‌ఐవీ రాకుండా అడ్డుకోవడంలో రాష్ట్రం కొంత ప్రగతిని సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్‌ఐవీతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్యలో తగ్గుదల రావడమేకాకుండా వారి నుంచి పుట్టిన బిడ్డకు హెచ్‌ఐవీ సోకే విషయంలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top