రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఖజానాపై రూ.2,245 కోట్ల భారం

 

న్యూఢిల్లీ: రైల్వే నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. దీంతో 12.3 లక్షల మంది నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులు వారి ఉత్పాదకత ఆధారంగా గరిష్టంగా రూ.17,951ల బోనస్‌ను అందుకోనున్నారు. అయితే రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌), రైల్వే రక్షక ప్రత్యేక దళం (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్‌ వర్తించదు. బోనస్‌ను దసరా సెలవులకు ముందే ఉద్యోగులకు అందజేయనున్నారు. లెక్కప్రకారం 201617 ఏడాదికి 72 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాల్సి ఉందనీ, అయితే గత ఆరేళ్ల నుంచి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నందున ఈ సారి కూడా దానిని కొనసాగించామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.



‘ఉత్పాదకత ఆధారంగా బోనస్‌ ఇవ్వడం అనేది ఉద్యోగుల పనికి ప్రోత్సాహకంలా ఉంటుంది. కాబట్టి మరింత మంది రైల్వే ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకుని ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుంది’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. బోనస్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.2,245.45 కోట్ల భారం పడుతుందని ప్రకటన పేర్కొంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో యువతకు ఉద్యోగ శిక్షణ ఇచ్చే ఉడాన్‌ పథకం గడువును 2018 డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

 

17 ముద్రణశాలల విలీనం

దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ముద్రణాలయాలను విలీనం చేసి వాటిని ఐదింటికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, మింటో రోడ్, మయపురి, మహారాష్ట్రలోని నాశిక్, కోల్‌కతాలోని టెంపుల్‌ స్ట్రీట్‌లో ఉన్న ముద్రణాలయాలు మాత్రమే ఇకపై పని చేస్తాయనీ, మిగిలిన వాటిని వాటిలో విలీనం చేస్తామని జైట్లీ చెప్పారు. ఆ ఐదింటినీ ఆధునీకరిస్తామనీ, మూతపడే ముద్రణాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వాటిలోకి బదిలీ చేస్తామని ఆయన తెలిపారు. 

 

పౌష్టికాహార చార్జీల పెంపు

అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద చిన్నారులు, కిశోర బాలికలు (11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారు) , గర్భిణులు, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహరానికి చెల్లించే చార్జీలను ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ఆరు నెలల నుంచి మూడేళ్ల మధ్య వయసున్న పిల్లలకు రోజుకు ఇచ్చే పౌష్టికాహారం చార్జీలను రూ.8 కి, గర్భిణులు, బాలింతలకు రూ.9.5కు ప్రభుత్వం పెంచింది.  తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం చార్జీలను రోజుకు రూ. 12.5కు, కిశోర బాలికలకు రూ.9.5కు కేంద్రం పెంచింది. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top