 
															సివిల్స్ ఉత్తీర్ణులు ఆరుగురిపై అనర్హత వేటు
జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది.
	-ఆందోళనలో ఆరుగురు విద్యార్థులు
	-చట్టాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి
	
	చెన్నై: జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో తమిళనాడుకు చెందిన 80 మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. ఓబీసీ కేటగిరికి చెందిన ఆరుగురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హఠాత్తుగా వారిని అనర్హులుగా ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షలకుపైగా ఉన్నందున ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి రానందున అనర్హులుగా పరిగణిస్తూ ఉత్తీర్ణతను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
	
	బాధితులను మీడియా పలుకరించగా సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నప్పుడే అన్ని సర్టిఫికెట్లను సమర్పించామని, వాటిని బాగా పరిశీలించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతించారని తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నేడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దశలో అనర్హులని అకస్మాత్తుగా ప్రకటించడం అన్యాయమని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చట్టపరమైన పోరాటం చేస్తామని వారు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
