గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం | Sakshi
Sakshi News home page

గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం

Published Thu, Aug 31 2017 1:04 AM

గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం

ఒక్క నెలలోనే 296 మంది చిన్నారుల దుర్మరణం
గోరఖ్‌పూర్‌:
ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌ దాస్‌ (బీఆర్డీ) వైద్య కళాశాలలో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు 296 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరిలో 213 నవజాత శిశువులు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 83 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ పీకే సింగ్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆస్పత్రిలోని మెదడువాపు, చిన్నారుల వార్డుల్లో దాదాపు 1,256 మంది మృతి చెందినట్లు సింగ్‌ పేర్కొన్నారు.

గడిచిన 24 గంటల్లో 17 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 37 మంది పిల్లలు (వీరిలో 11 మంది మెదడువాపు వ్యాధితో) ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారని సింగ్‌ వెల్లడించారు. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు ఉండడం, కామెర్లు, న్యుమోనియా, ఇన్ఫెక్షన్, మెదడువాపు తదితర కారణాలతో, విషమ పరిస్థితుల్లోనే చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారని సింగ్‌ తెలిపారు. చిన్నారులను కొంచెం ముందుగా ఆస్పత్రికి తీసుకురాగలిగితే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు చిన్నారుల మరణాలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్డీ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ రాజీవ్‌ మిశ్రాతో పాటు ఆయన భార్యను ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అరెస్టు చేసింది.

Advertisement
Advertisement