టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా | 13-Yr-Old Navi Mumbai Schoolgirl's Letter to Teacher Exposes Rapist Dad | Sakshi
Sakshi News home page

టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా

Jul 22 2015 1:45 PM | Updated on Apr 8 2019 6:21 PM

టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా - Sakshi

టీచర్.. మా నాన్న ఏం చేశాడో తెలుసా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది.

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అభం శుభం తెలియని పదమూడేళ్ల బాలిక తల్లిదండ్రుల అమానుషత్వానికి బలైపోయింది.  తల్లి కళ్లెదుటే తండ్రి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. దాదాపు ఆరేళ్ల పాటు ఈ నరకాన్ని భరించిన ఆ బాలిక చివరికి ఈ ఘోరాన్ని, అమానుషాన్ని టీచర్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆమె హృదయ విదారక గాధ వింటే కనురెప్ప కాటేయడం అంటే ఇదేనేమో అనిపించక మానదు.

ముంబైలోని ఒక స్కూల్ టీచర్కి  ఏడో తరగతి చదివే ఓ బాలిక ఉత్తరం రాసింది. మామూలు సెలవు చీటీ అనుకుని దాన్ని చూసిన ఆమెకు షాకింగ్ న్యూస్  తెలిసింది. తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడని,  అమ్మతో చెప్పినా ఫలితం లేదని , తనను ఎలాగైనా రక్షించమని ఆ ఉత్తరం సారాంశం.  దీంతో ఆమెకు నోట మాట రాలేదు. వెంటనే స్వచ్ఛందసంస్థ సాయంతో ఆమె పోలీసు కేసు నమోదు చేయించింది.


పోలీసుల విచారణలో ఆ బాలిక తనపై జరిగిన అకృత్యాన్ని వివరించింది.  పండ్ల వ్యాపారం చేసుకునే తన తండ్రి (45) తనపై చాలాసార్లు అత్యచారం చేశాడని తెలిపింది. తల్లి కళ్ల ముందే ఇదంతా జరగడంతో ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదని వాపోయింది. దీంతో పాటుగా తల్లి ఏవో మాత్రలు ఇచ్చి మింగమనేదని కూడా తెలిపింది.   ఎన్నిసార్లు తల్లితో మొరపెట్టుకున్నా వినలేదని, చివరికి చుట్టుపక్కల వారు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చడానికి ఇష్టపడలేదని తెలిపింది. తన అక్క,చెల్లి, తమ్ముడు ఇంట్లో లేనపుడు తండ్రి ఈ పనిచేసేవాడని వాపోయింది.


అయితే 15 రోజుల క్రితమే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని,  ఇందులో తనకే పాపం తెలియదని బాలిక తల్లి అంటోంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఇచ్చే మందు ఏమిటో విచారణ చేసిన తరువాత ఆమెపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు.  తల్లి పాత్రపై ఆరా తీసి, ఆమె ఇచ్చినవి గర్భనిరోధక మాత్రలా కాదా అని తేలిన తరువాత  చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.


ఇటీవల ముంబై నగరంలోని పలు పాఠశాలల్లో పిల్లలపై లైంగిక హింస (చైల్డ్ ఎబ్యూజ్) మీద కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి దాడులపై మౌనంగా ఉండకూడదని, బయటకు చెప్పాలని  వివరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ధైర్యం చేసి నోరు విప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement