పాపం పసివాళ్లు | mother died father jail | Sakshi
Sakshi News home page

పాపం పసివాళ్లు

Mar 28 2017 11:51 PM | Updated on Sep 28 2018 3:41 PM

పాపం పసివాళ్లు - Sakshi

పాపం పసివాళ్లు

మోతుగూడెం : చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపులోని ఓ కుటుంబంలో వరుసగా జరిగిన సంఘటనలతో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. వంతల బాబూరావు భార్య, బిడ్డలతో ఎంతో ఆనందంగా కుటుంబాన్ని గడిపేవాడు.

అనారోగ్యంతో తల్లి మృతి...జైలులో తండ్రి 
అనాథలైన నలుగురు చిన్నారులు
 
అమ్మ కొంగుపట్టుకుని ఆడుకుంటూ.. నాన్న భుజాలపై కూర్చుని ఈ లోకాన్ని చూస్తూ ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. పిలిచినా పలకనంత దూరానికి అమ్మ వెళ్లిపోగా, వేలి పట్టి నడిపించే నాన్న కటకటాలపాలయ్యాడు. అమ్మ ఎందుకు కనిపించడం లేదో, నాన్న ఎక్కడకు వెళ్లాడో కూడా తెలియని ఆ నలుగురు చిన్నారులు తాత సంరక్షణలో జీవిస్తున్నారు. 
 
మోతుగూడెం :  చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంపులోని ఓ కుటుంబంలో వరుసగా జరిగిన సంఘటనలతో నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. వంతల బాబూరావు భార్య, బిడ్డలతో ఎంతో ఆనందంగా కుటుంబాన్ని గడిపేవాడు. ఇంతలో బాబూరావుకు డబ్బుపై ఆశ కలిగి ఆలోచనలు పెడదారి పెట్టాయి. గంజాయి స్మగ్లర్లకు మూటలు మోస్తే డబ్బులు అధికంగా వస్తాయని ఆశించి పనికి వెళ్లి  చింతూరు పోలీసులకు పట్టుబడి రాజమహేంద్రవరం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కుటుంబభారం భార్య జమునపై పడింది. నాలుగు రోజుల క్రితం (శుక్రవారం) చింతూరు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుంది. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత ఆమె పోషకాహారం తీసుకోకపోవడంతో సోమవారం ఆమె వాంతులు, విరేచనాలతో బాధ పడుతూ నీరసించిపోయింది. విషయం తెలుసుకున్న తులసిపాక పీహెచ్‌సీ వైద్యుడు క్రాంతికిరణ్‌ తన సిబ్బందితో ఒడియాక్యాంపుకు వెళ్లి ఆమెను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఐటీడీఏ వాహనంలో స్వగ్రామం తీసుకువచ్చారు. తండ్రి జైలులో, తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె నలుగురు పిల్లలు ఆరేళ్ల చందు, ఐదేళ్ల దేవి, మూడేళ్ల గాయత్రి, ఐదు నెలల పసిపాప అనాథలయ్యారు. ప్రస్తుతం వీరు తాతయ్య రాజు సంరక్షణలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వీరికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement