
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : బీజేపీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడుతున్న శివసేన తాజాగా మరోసారి ఆ పార్టీపై మండిపడింది. బీజేపీకి అతిపెద్ద శత్రువు శివసేన అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను దేశం కోరుకోవడం లేదని, కాంగ్రెస్ లేదా జేడీ(ఎస్) నేత హెచ్‌డీ దేవగౌడలను ఆమోదిస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి అతిపెద్ద శత్రువు శివసేనేనని పార్టీ పత్రిక సామ్నాలో ప్రచురితమైన వ్యాసంలో ఆయన రాసుకొచ్చారు. పాల్ఘర్‌లో దివంగత ఎంపీ చింతామణ్ వనగ కుమారుడిని (శివసేన అభ్యర్థి) ఓడించి బీజేపీ ఆయనకు నివాళులర్పించిందని విమర్శించారు. చింతామణ్ మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
శివసేన ప్రధాన శత్రువ కావడంతోనే తమ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈవీఎంల మాయాజాలంతో పాల్ఘర్‌లో బీజేపీ విజయం సాధించిందని, ఇది కుంభకోణం కంటే ఎంతమాత్రం తక్కువ కాదన్నారు. పోలింగ్ రోజు దాదాపు వంద ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఓటింగ్ సమయం పొడిగించాలన్న శివసేన వినతిని ఈసీ తోసిపుచ్చిందని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ చేసిన ఇదే తరహా డిమాండ్‌ను మాత్రం ఈసీ ఆమోదించిందని ఆరోపించారు.
కీలక స్ధానాల్లో ఆర్‌ఎస్‌ఎస్ మనుషులను నియమించి ఎన్నికలను బీజేపీ ప్రభావితం చేస్తోందని విమర్శించారు.బీజేపీ పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచినా ఇతర లోక్‌సభ, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనేందుకు సంకేతమని అన్నారు. బీజేపీ పతనం ప్రారంభమైందని ఉప ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని రౌత్ వ్యాఖ్యానించారు.