‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీ రివ్యూ

Vijay Devarakondas World Famous Lover Movie Review And Rating - Sakshi

టైటిల్‌: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌
జానర్‌: లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామా
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్‌
దర్శకత్వం: క్రాంతి మాధవ్‌
సంగీతం: గోపీ సుందర్‌
నిర్మాతలు: కేఏ వల్లభ, కేఎస్‌ రామారావు
నిడివి: 155.37 నిమిషాలు

టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా ఫీల్‌గుడ్‌ చిత్రాల డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. టైటిల్‌ ప్రకటించినప్పట్నుంచి ఈ చిత్రంపై అందరిలోనూ పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్‌, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్‌ వంటి నలుగురు హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇక మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇదే తన చివరి లవ్‌ స్టోరీ అని విజయ్‌ దేవరకొండ ప్రకటించడంతో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’పై అందరి చూపు పడింది. ఇన్ని అంచనాల నడుమ ప్రేమికుల రోజు కానుకగా శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. మరి అందరి అంచనాలను ఈ చిత్రం నిలబెట్టిందా? ఈ సినిమాతో విజయ్‌ సిక్సర్‌ కొట్టాడా? లేక క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం.
  
కథ: 
ఒంటి నిండా గాయాలతో చెదిరిన జట్టు మాసిన గడ్డంతో హీరో జైల్లో ఉన్న సీన్‌తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ప్రతీ ఒక్క మనిషికి ఒక కథ ఉంటుంది.. తనకూ ఓ కథ ఉంటుంది అంటూ హీరో తన కథ చెప్పడం, రాయడం ప్రారంభిస్తాడు. హైదరాబాద్‌, ఇల్లందు, ప్యారిస్‌ల చుట్టు హీరో కథ తిరుగుతుంది. ఈ కథలో ఎన్నో మార్పులు, ఊహించని ఎన్నో మలుపులు చివరికి అందరూ కోరుకునే ముగింపుతోనే సినిమాకు ఎండ్‌ కార్డు పడుతుంది. అసలు కథ ఏంటో, ట్విస్టులు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

గూగుల్‌ మ్యాప్‌ కూడా చూపెట్టని ఓ అడ్రస్‌ కోసం హైదరాబాద్‌ గల్లీల్లో తిరుగుతూ అవస్త పడుతున్న యామిని (రాశీ ఖన్నా)కి గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) తారసపడతాడు. అడ్రస్‌ చూపించడంతో పాటు తన మనుసును కూడా యామినికి గౌతమ్‌ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యామిని కూడా గౌతమ్‌ ప్రేమలో పడిపోతుంది. చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్‌ డ్రీమ్‌. అయితే యామిని చెప్పిన ఒకే ఒక్క మాట కోసం గౌతమ్‌ ఉద్యోగం చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీనంతో వారిద్దరి జీవితం సాఫీ సాగిపోతున్న తరుణంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్‌ చెబుతుంది. ఎందుకు బ్రేకప్‌ చెబుతుంది? అసలు ఈ కథలోకి సువర్ణ(ఐశ్వర్య రాజేశ్‌), స్మిత(క్యాథరీన్‌), ఈజ(ఇజాబెల్లే)లు ఎందుకు ఎంటర్‌ అయ్యారు? గౌతమ్‌ సీనయ్యగా ఎందుకు మారాడు? అసలు గౌతమ్‌ ఎందుకు ప్యారిస్‌ వెళ్లాడు? గౌతమ్‌ చివరికి రైటర్‌ అయ్యాడా? గౌతమ్‌ యామినిలు చివరికి కలుసుకున్నారా అనేదే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా కథ.

నటీనటులు:
వన్‌ మ్యాన్‌ షో, అతడే ఒక సైన్యం, ఒకే ఒక్కడు ఇలా ఎన్ని చెప్పినా విజయ్‌ దేవరకొండ గురించి తక్కువే అవుతుంది. సినిమాకు ప్రాణం పోశాడు. గౌతమ్‌, శ్రీను పాత్రలలో విజయ్‌ తప్ప మరో హీరోను కలలో కూడా ఊహించని విధంగా మెస్మరైజ్‌ చేశాడు. అక్కడక్కడా అర్జున్‌రెడ్డి ఫ్లేవర్‌ కనిపించినా ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషన్‌, కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని కోణాలను విజయ్‌ తన నటనలో చూపించాడు. హీరో తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాశీ ఖన్నా గురించి. కొన్ని సన్ని వేశాలలో​ అందంతో ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల ఏడిపించేసింది. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న మరో నటి ఐశ్వర్యా రాజేశ్‌. సువర్ణ అనే డీ గ్లామర్‌, మధ్య తరగతి గృహిణి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. క్యాథరీన్‌, ఇజాలకు నటనపరంగా కంటే తమ అందాలతో కుర్రకారును కట్టిపడేశారు. కొన్ని చోట్ల సైదులు(మై విలేజ్‌ షో అనిల్‌) తనదైన రీతిలో నవ్వించగా.. గౌతమ్‌ స్నేహితుడిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. 


విశ్లేషణ:
‘ప్రేమ అంటే ఓ సాక్రిఫైస్‌, కాంప్రమైజ్‌.. ప్రేమలో దైవత్వం ఉంటుంది’అనే ఓ చిన్న లైన్‌ పట్టుకొని పూర్తి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రాంతి మాధవ్‌. జైలు సీన్‌.. ఆ తర్వాత రాశీ ఖన్నా, విజయ్‌ దేవరకొండల మధ్య సీన్లతో సినిమా కథను మెల్లగా ఆరంభించాడు దర్శకుడు. సినిమా మొదలైన కాసేపటికి అసలు కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. హీరో సాధారణ ఎంట్రీ, హీరోయిన్స్‌తో రొమాన్స్‌, లవ్‌ సీన్స్‌, ఇల్లందు ఎపిసోడ్‌తో ఫస్టాఫ్‌ అంతా అలా సాదా సీదాగా సాగిపోయింది. అయితే విజయ్‌, ఐశ్యర్యల మధ్య వచ్చే కొన్ని సీన్లు రియాలిస్టిక్‌గా ఉంటాయి. మన ఇంట్లో, మన ఊళ్లో జరిగిన, చూసిన విధంగా ఉంటాయి.
https://www.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif 

ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్‌ పూర్తిగా తేలిపోయాడు. కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు. బోరింగ్‌, సాగదీత సీన్లు థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి. కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేసేల ఉంటాయి. అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుందనుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు. అయితే కథ కొత్తగా, వినూత్నంగా ఉంది. సీన్లు కూడా బాగున్నాయి. విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు. దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.  
   
ఇక సాంకేతిక విషయాని​కి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. స్క్రీన్‌ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది. పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొన్ని చోట్ల మె​స్మరైజ్‌ చేసేలా ఉంటుంది. క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి. ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం, ప్రపంచ బాధలను తన బాధలుగా భావించి రచయిత రాయడం ప్రారంభిస్తాడు’ అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి.  నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది. చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/09/13/Review.gif
ప్లస్‌ పాయింట్స్‌: 
విజయ్‌ దేవరకొండ నటన
ఇల్లందు ఎపిసోడ్‌
కాన్సెప్ట్‌

మైనస్‌ పాయింట్స్‌
సాగదీత, బోరింగ్‌ సీన్లు
సినిమా నిడివి
దర్శకత్వ లోపం

- సంతోష్‌ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top