కేరెక్టర్ పాత్రలకు పెట్టింది పేరు.. శ్రీహరి!!

కేరెక్టర్ పాత్రలకు పెట్టింది పేరు.. శ్రీహరి!! - Sakshi


కమెడియన్, విలన్, హీరో, కేరెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తెలుగు సినీ కళామతల్లి సేవలో పరిపూర్ణంగా జీవించిన నటుడు.. శ్రీహరి. కెరీర్ ఆరంభంలో ప్రేక్షకులను మరీ అంతగా ఆకట్టుకోలేకపోయారన్న ఒకటి రెండు విమర్శలున్నా, వాటిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. రోజురోజుకూ తన పెర్ఫార్మెన్సును పెంచుకుంటూనే వెళ్లారు. కండలు తిరిగిన శరీరంతో విలన్గా, అసమాన నటనా చాతుర్యంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర లాంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి ఆయన నటనా ప్రతిభకు అద్దంలా నిలిచాయి. టాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన కేరెక్టర్ ఆర్టిస్టుల్లో శ్రీహరిని అగ్రస్థానంలో ఉన్నవారిలో ఒకరిగా చెప్పుకోవచ్చు. శ్రీహరి లేని లోటు తీర్చలేనిదని, ఆయనను నటుడిగా నిలబెట్టడం తన అదృష్టమని నిర్మాత మహేందర్ అన్నారు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ చాలాకాలం పరిశ్రమలో నిలదొక్కుకోడానికి కష్టపడిన శ్రీహరి, 1999లో మహేందర్ నిర్మించిన 'పోలీస్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. రెండు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్లో ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.



ఒక్కడే, శ్రీశైలం, దాసన్న, భైరవ లాంటి చిత్రాల్లో పోలీసు పాత్రలతో మైమరిపించారు. అన్నయ్య, డాన్ లాంటి పాత్రలకు శ్రీహరి తప్ప మరొకరు సరిపోరంటే అతిశయోక్తి కాదు. నెగెటివ్ పాత్రలు చేయాలన్నా, కామెడీ చేయాలన్నా కూడా ఆయన తర్వాతే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిషకు అన్నయ్యగా అభిమానం, ఆగ్రహం.. అన్నింటినీ శ్రీహరి అభినయించిన తీరు అసమాన్యం. ఇందుకు గాను ఆయనకు నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. కింగ్, డాన్ శీను లాంటి చిత్రాల్లో తన కామెడీతో జనాన్ని కడుపుబ్బ నవ్వించారు. స్టంట్ మాస్టర్గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి, చాలాకాలం పాటు విలన్ పాత్రలు చేస్తూ వచ్చారని,  గత కొంత కాలంగా ఆరోగ్యం బాగోకపోవడంతో బరువు తగ్గారని, దాని గురించి మాత్రం తనకు ఏమీ చెప్పలేదని మహేందర్ అన్నారు.



1998లో తెలుగు నటి డిస్కోశాంతిని శ్రీహరి పెళ్లి చేసుకున్నారు. అప్పటివరకు డాన్సర్, వ్యాంప్ పాత్రలు చేసిన శాంతి.. పెళ్లి తర్వాత నటన మానేసుకున్నారు. వాళ్లకు ఇద్దరు కుమారులు, అక్షర అనే కుమార్తె ఉన్నారు. అయితే, అక్షర ఇటీవలే కన్నుమూసింది. ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్ స్థాపించిన శ్రీహరి, మెదక్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. శ్రీహరి లేడంటే నమ్మలేకపోతున్నానని, ఇటీవలే ఆయనను హైదరాబాద్లో కలిశానని ప్రముఖ నటుడు శరత్ బాబు అన్నారు. శ్రీహరి క్రమశిక్షణ గల నటుడని, ఇతరులతో చాలా స్నేహంగా ఉంటాడని చెప్పారు.  పేజీల కొద్దీ డైలాగులను ఒకే టేక్లో గుక్క తిప్పుకోకుండా చెప్పిన వైనాన్ని తాను మర్చిపోలేనన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top