‘సమ్మోహనం’ మూవీ రివ్యూ

Sammohanam Telugu Movie Review - Sakshi

టైటిల్ : సమ్మోహనం
జానర్ : ఎమోషనల్‌ లవ్‌ డ్రామా
తారాగణం : సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, హరితేజ
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌

స్టార్ ఇమేజ్‌ను కాకుండా కథా బలాన్ని నమ్ముకొని సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అష్టాచమ్మా, జెంటిల్‌మన్‌, అమీతుమీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న మోహనకృష్ణ ఈ సారి సమ్మోహన పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్‌ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా..? మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? లవర్‌ బాయ్‌గా సుధీర్ బాబు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ ;
ఆర్‌.విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు అంటూ తిరగటం ఇష్టం లేని కుర్రాడు. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు బొమ్మలతొ చిన్నపిల్లల కథల పుస్తకం గీస్తుంటాడు. ఎలాగైన ‘అనగనగా పబ్లికేషన్స్‌’ ద్వారా తన బొమ్మల పుస్తకాన్ని విడుదల చేయించే ప్రయత్నాల్లో ఉంటాడు. సర్వేష్(సీనియర్‌ నరేష్‌), విజ్జు తండ్రి సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌తీసుకొని మరి సినిమా ప్రయాత్నాలు చేస్తుంటాడు. తన ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో ఓ సినిమా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు సర్వేష్‌. ఆ సినిమాలో హీరోయిన్‌ సమీరా రాథోడ్‌ (అదితి రావు హైదరీ). షూటింగ్ ప్రారంభమైన తరువాత తెలుగు మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్న సమీరాకు విజ్జు కోచింగ్‌ ఇస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి (సాక్షి రివ్యూస్‌) తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో విజ్జు సమీరా మీద కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? అసలు సమీరా, విజ్జు అంటే ఇష్టం లేదని ఎందుకు చెప్పింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
విజయ్‌ పాత్రలో సుధీర్‌ బాబు ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అ‍ద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో అదితి రావు హైదరీ జీవించారు. స్టార్‌ ఇమేజ్‌, ప్రేమ, వేదింపుల మధ్య నలిగిపోయే అమ్మాయిగా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్‌ హుందాగా కనిపించారు.(సాక్షి రివ్యూస్‌) ముఖ్యంగా సుధీర్‌ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్‌ రామకృష్ణ, అభయ్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రలో తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ ;
సమ్మోహనం అనే టైటిల్‌తోనే ఆకట్టుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కథా కథనాలతో నిజంగానే సమ్మోహనపరిచారు. ప్రేమకథకు బలమైన ఎమోషన్స్‌, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా తొలి భాగంలో హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా వాళ్ల మీద వేసిన పంచ్‌లు బాగా పేలాయి. ప్రేమకథ మొదలైన తరువాత కథనంలో కాస్త వేగం తగ్గింది. ఆ లోటును సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ తన మెలోడియస్‌ మ్యూజిక్‌తో కవర్‌ చేశాడు. (సాక్షి రివ్యూస్‌) ప్రతీ పాట కథలో భాగంగా వస్తూ అలరిస్తుంది. నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ డైలాగ్స్‌. చాలా సందర్భాల్లో డైలాగ్స్‌ మన జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తాయి, ఆలోచింపచేస్తాయి. పీజీ విందా సినిమాటోగ్రఫి సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
లీడ్‌ ఆర్టిస్ట్స్‌ నటన
డైలాగ్స్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
నెమ్మదిగా సాగే కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top