ఈ సినిమా మహేశ్‌కి నన్ను దగ్గర చేసింది

sammohanam movie sucessmeet - Sakshi

సుధీర్‌ బాబు

‘‘సమ్మోహనం’ కథని 2012లో రాసుకుని కొందరికి వినిపించాను. శివలెంక కృష్ణప్రసాద్‌గారు మాత్రం కథ వినగానే సినిమా చేస్తానన్నారు. అంతే కాకుండా నాపై, కథపై నమ్మకంతో ఈరోజు వరకూ ఆయన సినిమా చూడలేదు’’ అని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఆయన దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ‘సమ్మోహనం’ ఈనెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘తరుణ్‌ భాస్కర్‌ డైరెక్ట్‌ చేసిన ‘పెళ్ళిచూపులు’ సినిమాలో ఓ సన్నివేశం చూసి, ఆ ఇన్‌స్పిరేషన్‌తో ‘సమ్మోహనం’ కథను తయారు చేసుకున్నాను. సుధీర్‌బాబు చాలెంజింగ్‌గా నటించారు. నా కథ వినగానే సినిమా చేయడానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ వివేక్‌ సాగర్‌ ఒప్పుకున్నాడు. కెమెరామెన్‌ విందా నా మనసులో ఏముందో అది తెర మీద చూపిస్తారు. మా మధ్య మంచి అనుబంధం ఉంది’’ అన్నారు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘సూపర్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా చేస్తున్నాడు కదా! వీడేంటో? అని సామాన్యులు దూరంగా ఉండిపోయారు. అలాంటి వాళ్లకు నన్ను దగ్గర చేసిన చిత్రం ‘సమ్మోహనం’. ఇప్పటివరకూ నన్ను ‘ప్రేమకథా చిత్రమ్‌’ సుధీర్‌బాబు అని పిలిచేవారు. ఇకపై ‘సమ్మోహనం’ సుధీర్‌బాబు అంటారు. మహేశ్‌ బావగా నాకు దగ్గరే కానీ.. యాక్టర్‌గా కాస్త గ్యాప్‌ ఉండేదనిపించేది. ఈ సినిమా ఓ యాక్టర్‌గా నన్ను తనకు దగ్గర చేసింది. షూటింగ్‌లో నరేశ్‌గారిని నిజమైన నాన్నగానే భావించా. ఇంద్రగంటిగారు భాషను ప్రేమించేంతలా భార్యను కూడా ప్రేమించరు’’ అన్నారు.

‘‘కథ విన్న రోజు నుంచి ‘సమ్మోహనం’ గొప్ప హిట్‌ అవుతుందని చెప్పా.. అన్నట్టుగానే అయ్యింది. జంధ్యాలగారికి రీప్లేస్‌మెంట్‌ ఉండదు. ఆయనలాగే ఇంద్రగంటిగారికి కూడా రీప్లేస్‌మెంట్‌ లేదు’’ అన్నారు నటుడు నరేశ్‌. ‘‘సమ్మోహనం’ లాంటి మంచి సినిమాను నేను చేయడానికి కారణమైన సుధీర్‌బాబు, మోహనకృష్ణకు థ్యాంక్స్‌’’ అన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్‌. సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, నటుడు తనికెళ్ల భరణి, నటి పవిత్రా లోకేశ్, దర్శకుడు తరుణ్‌ భాస్కర్, కెమెరామెన్‌ పి.జి.విందా, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top